సైరా చిత్రం చూసిన ప్రతి ఒక్కరు మెగాస్టార్ చిరంజీవి తర్వాత లక్ష్మీ పాత్రలో తమన్నా నటన హైలైట్ గా నిలిచిందని అంటున్నారు. తమన్నాకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అద్భుతమైన హావభావాలతో లక్ష్మీ పాత్రకు తమన్నా పూర్తి న్యాయం చేసింది.

దర్శకుడు సురేందర్ రెడ్డి, సైరా చిత్ర యూనిట్ సినిమా ప్రారంభానికి ముందు లక్ష్మీ పాత్ర కోసం చాలా మంది హీరోయిన్లని అనుకున్నారు. కానీ వారంతా ఏదోఒక సాకు చెప్పి తప్పించుకున్నారట. ఇందులో తమన్నా పోషించినది హీరోయిన్ పాత్ర కాదు. బహుశా తమకు ఈ పాత్రలో సరైన గుర్తింపు లభించదని ఆ హీరోయిన్లు భావించి ఉంటారు. 

కానీ సినిమా విడుదలయ్యాక తమన్నాకు దక్కుతున్న ప్రశంసలతో లక్ష్మీ పాత్ర వదిలేసుకున్న హీరోయిన్లంతా షాకవుతున్నారట. అనవసరంగా సైరా చిత్రం మిస్ చేసుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 

బాహుబలి చిత్రంతో తమన్నాకు ఇండియా మొత్తం క్రేజ్ దక్కింది. ఆ క్రేజ్ ని సైరా చిత్రం మరింతగా పెంచింది. ప్రస్తుతం తమన్నా తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది.