సౌత్ సినిమాలో గ్లామర్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ తమన్నా. బాహుబలి సిరీస్‌తో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ఈ బ్యూటీ కొన్ని త్రో బ్యాక్‌ ఫోటోస్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోలతో పాటు ప్రస్తుతం యూఎస్‌ఏలో ఉన్న తన తమ్ముడు ఆనంద్‌ను ఎంతగానో మిస్ అవుతున్నా అంటూ కామెంట్ చేసింది. చిన్నతనంలో తమ్ముడితో కలిసి దిగిన ఫోటోలతో పాటు తమ అనుబంధాన్ని షేర్ చేసుకున్న ఈ భామ భావోద్వేగానికి లోనైంది.

ఈ సందర్భంగా తమన్నా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫోటోల్లో ఆనంద్‌ తమన్నా జుట్టును మీసం పెట్టికొని సరదాగా అక్కను ఆటపట్టిస్తున్నాడు. ఈ ఫోటోలను షేర్ చేసిన తమన్నా ఈ లాక్‌ డౌన్‌ పీరియడ్‌లో నువ్వు కూడా ఇండియాలో ఉంటే బాగుండేది ఆనంద్ భాటియా అంటూ కామెంట్ చేసింది. అంతకన్నా ముందు తన చిన్ననాటి ఫోటోలు ఉన్న ఆల్బమ్ మీడియాను అభిమానులతో షేర్ చేసుకుంది తమన్నా. `ఈ రోజు ఇంటిని శుభ్రం చేస్తుంటే నాకు పూర్తి నా చిన్ననాటి ఫోటోలతో ఉన్న ఈ ఆల్బమ్‌ దొరికింది. ఆ తరువాత సమయమంతా ఆ ఫోటోలను చూస్తూ ఆ మెమరీస్‌ గుర్తు చేసుకుంటూ గడిపేసా` అంటూ కామెంట్ చేసింది.

ఇక లాక్‌ డౌన్‌ సమయంలో ఇతర సెలబ్రిటీల తరహాలోనే తమన్నా కూడా కుక్‌గా మారిపోయింది. కప్‌ కేక్స్‌ను రెడీ చేసి వాటిని అభిమానులతో షేర్ చేసుకుంది. అంతేకాదు తన ఫిట్ నెస్‌ సీక్రెట్స్‌ను అభిమానులతో పంచుకుంటు తన వర్క్‌ అవుట్ వీడియోస్‌ను కూడా సోషల్ మీడియా పేజ్‌లో షేర్‌ చేసింది తమన్నా. ప్రస్తుతం ఈ భామ హిందీలో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న బోలే చుడియన్‌ సినిమాలో నటిస్తోంది.