మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజైంది. సౌత్ లాంగ్వేజెస్ లో ఈ సినిమా బాగానే ఆడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబడుతోంది. అయితే 
బాలీవుడ్ లో మాత్రం ఈ సినిమా పరిస్థితి అంతగా బాలేదు.

అక్కడ కూడా ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. మొదటిరోజు ఓపెనింగ్స్ భారీ స్థాయిలో వచ్చాయి. రెండో రోజు వసూళ్లు డ్రాప్ అయినప్పటికీ వీకెండ్ కాదు కాబట్టి శని, ఆదివారాల్లో సినిమా జోరు వేరుగా ఉంటుందని భావిస్తున్నారు. తెలుగురాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా అనే విషయాన్ని పక్కన పెడితే నార్త్ లో మాత్రం ఈ సినిమా డిజాస్టర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

'సైరా' హిందీ వెర్షన్ తొలిరోజు రూ.2.5 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది. 'వార్' సినిమా పోటీకి ఉండడంతో అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదని అనుకున్నారు. అయితే రెండో రోజు 'సైరా' వసూళ్లు దారుణంగా పడిపోయాయి. నెట్ వసూళ్లు కోటి రూపాయలకు అటు ఇటుగా ఉన్నట్లు తెలుస్తోంది. 'సైరా'కి బాలీవుడ్ క్రిటిక్స్ నుండి మంచి రివ్యూలు వచ్చాయి.

'బాహుబలి' తరహా సినిమా అంటూ కొందరు ప్రశంసించారు. కానీ ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించలేకపోయింది. అమితాబ్ లాంటి పెద్ద ఆర్టిస్ట్ ఉన్నప్పటికీ హిందీలో కలెక్షన్స్ పుంజుకోవడం లేదు. వీకెండ్ లో కలెక్షన్స్ పెరిగినా సినిమా రూ.25 కోట్ల షేర్ రాబట్టాల్సివుంది కాబట్టి అంత కష్టమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.