సైరా రిలీజ్ తర్వాత కూడా మెగాస్టార్ చిరంజీవి బిజీ బిజీగా గడుపుతున్నారు. వరుసగా రాజకీయ ప్రముఖుల్ని కలుసుకుంటూ సైరా చిత్రాన్ని వీక్షించాలని కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ సీఎం జగన్, తెలంగాణ గవర్నర్ తమిళ సైని చిరంజీవి ఇదివరకే కలసిన సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం చిరంజీవి ఢిల్లీ టూర్ వెళ్లారు. నేడు చిరంజీవి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఉపరాష్ట్రపతి కోసం ఆయన నివాసంలోనే సైరా చిత్ర ప్రత్యేక షోని ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు, చిరంజీవితో పాటు మరికొందరు ప్రముఖులు సైరా చిత్రాన్ని వీక్షించనున్నారు. ఇదిలా ఉండగా గురువారం రోజు చిరు భారత ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. వారికీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్పతరం, సైరా చిత్ర విశేషాలని వివరించనున్నట్లు తెలుస్తోంది. 

సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ పూర్తిగా రాజకీయాలని పక్కన పెట్టేశారు. చిరంజీవికి బిజెపి ఆహ్వానం పలుకుతోందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి బిజెపి పెద్దలతో వరుసగా భేటీ కానుండడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.