మెగాస్టార్ బాక్సాఫీస్ స్టామినాని మరోసారి నిరూపించేలా సైరా వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. తొలి రోజు కళ్ళు చెదిరేలా 37 కోట్లకు పైగా షేర్ సాధించి నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది. రెండవరోజు కూడా సైరా చిత్రం బాక్సాఫీస్ వద్ద తన పట్టు నిలుపుకుంది. 

సైరా చిత్రం గాంధీ జయంతి రోజున బుధవారం విడుదలయింది. సెలవురోజు సహజంగానే సినిమాకు అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ గురువారం వర్కింగ్ డే. వర్కింగ్ డే రోజు కూడా సైరా చిత్రం 10 కోట్లకు పైగా తెలుగు రాష్ట్రాల్లో షేర్ సాధించింది. రెండవరోజు బాహుబలి 2, సాహో తర్వాత ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన మూడవ చిత్రంగా సైరా రికార్డ్ నెలకొల్పింది. సాహో చిత్ర రెండవరోజు శనివారం. వీకెండ్ ఆ చిత్రానికి కలసి వచ్చింది. 

వీకెండ్ లో సైరా వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా సైరా రెండు రోజుల్లో కలిపి తెలుగు రాష్ట్రాల్లో 47 కోట్లకు పైగా షేర్ సాధించింది. కొన్ని ప్రాంతాల్లో కేవలం రెండు రోజుల్లోనే 50 శాతానికి పైగా సైరా రికవరీ సాధించింది. 

నైజాంలో 12 కోట్లు, సీడెడ్ లో 7.7 కోట్లు, ఉత్తరాంధ్రలో 6 కోట్లు, గుంటూరులో 5.7, ఈస్ట్ గోదావరిలో 5.3 కోట్ల షేర్ రాబట్టింది. నెల్లూరులో 2.4, వెస్ట్ గోదావరిలో 4.3 కోట్ల షేర్ తో సైరా చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. రానున్న రోజుల్లో దసరా సెలవులు కూడా ఉండడంతో సైరా తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ కావడం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

తొలి తెలుగు స్వాతంత్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా చిత్రాన్ని తెరకెక్కించారు. చిరంజీవి ఎంతో ఇష్టపడి నటించిన చిత్రం ఇది. బిగ్ బి అమితాబ్, నయనతార,తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి లాంటి స్టార్ నటీనటులు ఈ చిత్రంలో నటించడం విశేషం.