కమెడియన్ గా టాలీవుడ్ లో సత్తా చాటిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పాలని చూశారు. ఈ క్రమంలో జగన్ పార్టీతో కలిసి అడుగులు వేశారు. ఆయన కష్టానికి తగ్గ గుర్తింపు వైసీపీ పార్టీలో దక్కింది. పార్టీలో చేరిన కొన్నిరోజులకే స్టేట్ ప్రధాన కార్యదర్శిగా కీలకపదవి దక్కింది.

ఇక వైసీపీ అధికారంలోకి రాగానే పృథ్వీని ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్ గా నియమించారు. అయితే ఊహించని విధంగా ఆ పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఎస్వీబీసీలో పనిచేసే ఓ మహిళతో పృథ్వీ రాసలీలలు సాగిస్తున్నారని.. ఓ ఆడియో కాల్ ని లీక్ చేసి పృథ్వీని పదవి నుండి తప్పించారు.

అయితే తాను మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని.. తనది తప్పని తేలితే చెప్పుతో కొట్టినా పడతానంటూ మీడియా ముందు చెప్పారు. ఒక మహిళతో తాను రాసలీలలు సాగిస్తున్నానంటూ వైరల్ అవుతోన్న ఆడియో టేప్.. ఫేక్ అని కావాలనే తనను ఇరికించారని చెప్పాడు. ఈ ఇష్యూపై అసలు నిజం తేలేవరకు నైతిక బాధ్యత వహిస్తూ.. ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

పార్టీలో తనకు గుర్తింపు వస్తుందనే అక్కసుతో కొందరు ప్లాన్ చేసి ఇలా చేశారని ఆరోపించారు పృథ్వీ. ఇదిలా ఉండగా.. ఇటీవల చేతికి కట్టుతో తిరుపతిలో కనిపించిన ఆయన మరోసారి పాత గాయాన్ని తల్చుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ టీవీ ఛానెల్ లో ప్రోగ్రామ్ కి హాజరైన ఆయన తనకు అన్యాయం జరిగిందంటూ ఏడ్చేశారు.

తానెప్పుడూ ఇలాంటి టీవీ కార్యక్రమాల్లో కన్నీళ్లు పెట్టుకోలేదంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తన జాతకం ప్రకారం తనను ఇబ్బంది పెట్టినవాళ్లు ఎవరూ బతికిలేరని.. వెంకటేశ్వర స్వామి సాక్షిగా.. కుటుంబ సభ్యుల సాక్షిగా ఒట్టేసి చెబుతున్నా అంటూ ఎమోషనల్ అయ్యారు.