కరోనా దానివల్ల విధించిన లాక్ డౌన్ ప్రభావం దేశంలో అన్ని రంగాలపై ఉంది. ముఖ్యంగా సిని పరిశ్రమపై భారీగా పడనుంది. ఎందుకంటే ఈ విపత్తు వల్ల జనం ధైర్యం చేసి థియోటర్స్ కు రారు అనేది నిజం,అంతేకాకుండా ఆర్దికంగా కూడా ఇబ్బందుల్లో పడతారు..దాంతో నిత్యావసరాలపై పెట్టినట్లుగా ఎంటర్టైన్మెంట్ పై ఎక్కువగా ఖర్చుపెట్టడానికి ఇష్టపడరు. ఈ ప్రభావం ఖచ్చితంగా సినీ పరిశ్రమపై భారీగా పడుతుందని ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. మరో నాలుగు నెలలు దాకా జనం థియోటర్స్ కు రారు అని చెప్తున్నారు. ఈ నేపధ్యంలో సురేష్ బాబు మాట్లాడారు. ఆయన చెప్పిన మాటలు వింటే సినీవాళ్లకు చెమటలు పట్టేలా ఉన్నాయి. 

తెలుగు చిత్ర పరిశ్రమ లో కరోనా వల్ల నెలకొన్న సంక్షోభం ఇప్పట్లో తీరేలా లేదంటూ సురేష్ బాబు వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే మునుపటి పరిస్థితి రావడం అంతలా సాధ్యం అయ్యే పని కాదంటూ సురేష్ బాబు తెల్చి చెప్పారు. ఆయన చెప్పేదేమిటంటే...లాక్ డౌన్ ఎత్తివేస్తే షూటింగ్ లు ప్రారంభం అవుతాయేమో కాని థియేటర్లు మాత్రం ఓపెన్ అవ్వడానికి నెలలు సమయం పట్టవచ్చు అన్నాడు. 

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం థియేటర్లు ఇంకా మల్టీ ప్లెక్స్ లు కలిపి 1850 ఉన్నాయి. అవన్నీ కూడా నెలల తరబడి మూతపడే ఉండనున్నాయని చెప్పుకొచ్చారు. దాంతో భారీగా నష్టం వస్తుందని చెప్పుకొచ్చారు. కరోనాకు వ్యాక్సిన్ తయారు అయినప్పుడే ప్రేక్షకులు మళ్లీ థియేటర్ల వైపుకు వస్తారని సురేష్ బాబు అభిప్రాయ పడ్డారు. ఇండస్ట్రీలో మునుపటి స్థితి ఏర్పడాలంటే కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చి వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోకి రావాలి అని క్లారిటీ గా ఇచ్చారు.

అలాగే ప్రస్తుత పరిస్థితిలో సినిమా పరిశ్రమ రెవెన్యూ జీరో పర్సంట్.. ఇండియాలో ఉన్న 10 వేల థియేటర్లలో నాలుగు నుండి అయిదు లక్షల మంది పనిచేస్తున్నారు. ఒకొక్క ఇండస్ట్రీలో 25 నుంచి 50 వేల మంది నటీనటులున్నారు. వారెవరికీ పని ఉండదు. ఆదాయం ఉండదు. అలాగే  అప్పు తీసుకున్న నిర్మాతలకు వడ్డీ ఒత్తిడి ఉంటుంది. రోజువారీ వేతనానికి పనిచేసే వర్కర్స్, యాక్టర్ల రెవెన్యూ జీరో అయిపోయింది అని చెప్పుకొచ్చారు.  

స్టూడియోలలో పనిచేసే వారిదీ ఇదే పరిస్థితి. స్టూడియో, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్.. నలుగురికీ కష్టాలున్నాయి. జనసమూహం ఎక్కువగా ఉండే రెస్టారెంట్స్, పబ్స్, పెళ్లిల్లు, థియేటర్స్ వంటివి చివర్లో ఓపెన్ చేస్తారు. అప్పటి వరకు ఓపిక పట్టాల్సిందే.. అని ఆయన తేల్చి చెప్పారు.