ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి. రానా నటుడిగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. బాహుబలి చిత్రంలో భల్లాల దేవుడిగా రానా నటన వర్ణనాతీతం. అద్భుతమైన నటనతో ఆ చిత్రంలో ప్రభాస్ కు ధీటుగా నిలిచాడు. రానా ఆరడుగుల కటౌట్ కాబట్టి ఎలాంటి పౌరాణిక, జానపద కథలకైనా ఇట్టే సరిపోతాడు. 

అందుకే రానా తండ్రి అతడితో భారీ పౌరాణిక చిత్రం 'హిరణ్యకశ్యప'కు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఏళ్ల తరబడి ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతూనే ఉంది. 

ప్రస్తుతం వెంకిమామ ప్రచారంలో భాగంగా సురేష్ బాబు ఈ చిత్రం గురించి మాట్లాడారు. హిరణ్యకశ్యప ఎందుకు ఆలస్యం అవుతోందనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. దీనికి సురేష్ బాబు సమాధానం ఇస్తూ.. హాలీవుడ్ చిత్రాలని గమనించారా.. వారు షూటింగ్ కంటే ప్రీప్రొడక్షన్, కథ కోసమే సంవత్సరాల సమయం కేటాయిస్తారు. 

ప్రీప్రొడక్షన్ ఎంత పక్కాగా ఉండాలి. స్క్రిప్ట్ అద్భుతంగా ఉండాలి. అప్పుడే సినిమా క్వాలిటీ బావుంటుంది. హాలీవుడ్ వాళ్ళ సక్సెస్ కు కారణం అదే. హిరణ్యకశ్యప విజువల్స్ మునుపెన్నడూ చూడని విధంగా ఉండాలి. నా టార్గెట్ అదే. అందుకే మూడేళ్ళుగా దర్శకుడు, మా టీం ప్రీ ప్రొడక్షన్ పై వర్క్ చేస్తున్నారు అని సురేష్ బాబు తెలిపారు.