చెన్నైలోని సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటి ముందు ఆయన అభిమానులు మంగళవారం ఆందోళనకు దిగారు. రాజకీయాల్లోకి వచ్చి, పార్టీ పెట్టి.. ఎన్నికల్లో పోటీ చేయాలంటూ రజనీని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

కాగా, త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి వస్తానని గతంలో ప్రకటించిన రజినీకాంత్... తాజాగా వెనక్కి తగ్గారు. ఇప్పట్లో పార్టీ ప్రకటన ఉండదని తలైవా స్పష్టం చేశారు. ఈ మేరకు రజినీకాంత్ ట్వీట్ చేశారు.

తనకు ఆరోగ్యం సహకరించడం లేదంటూ... రాజకీయాల్లో ప్రవేశంపై మూడు పేజీల ప్రకటన విడుదల చేశారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం తన అభిమానులతోపాటు ప్రజలకు నిరాశ కలిగిస్తుందనే.. కానీ పరిస్థితుల రీత్యా అభిమానులు తనను క్షమించాలని రజనీకాంత్ విజ్ఞప్తి చేశారు.

ఇక ఈ నెల 25న రజినీకాంత్‌కు ఉన్నట్టుండి బీపీ పెరగడంతో ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. రెండు రోజుల చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజినీకాంత్.. చెన్నై చేరుకున్నారు.

అయితే పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి కుటుంబసభ్యులతో ఆయన చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో... రాజకీయాలు వద్దని కుటుంబసభ్యులు ఆయనకు సూచించినట్టు ప్రచారం జరుగుతోంది.