సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. మహేష్ ఆర్మీ మేజర్ గా నటించిన ఈ చిత్రం సంక్రాంతికి సందడి చేయబోతోంది. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 

తొలిసారి క్రేజీ బ్యూటీ రష్మిక మందన తొలిసారి మహేష్ తో రొమాన్స్ చేస్తోంది. తాజాగా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. షూటింగ్ పూర్తయిన సంధర్భంగా మహేష్ తో కలసి మూవీ యూనిట్ దిగిన ఫోటోని షేర్ చేశారు. 

ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తాను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రం అద్భుతమైన అనుభూతిని ఇచ్చిన జర్నీ అని తెలిపారు. ఇంతటి మెమొరబుల్ జర్నీకి కారణమైన సూపర్ స్టార్ మహేష్ కు ధన్యవాదాలు అని అనిల్ సుంకర ట్వీట్ చేశారు. 

జులై 5న సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అద్భుతమైన జర్నీ ప్రారంభించాం. డిసెంబర్ 18న ముగిసింది. సంక్రాంతికి మిమ్మల్ని అలరించేందుకు రాబోతున్నాం అని దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. 

అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని మహేష్ అభిమానులు కోరుకునే కమర్షియల్ అంశాలతో రూపొందించారు. ఇప్పటికే విడుదలైన, టీజర్ పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంతో ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు.