గాంధీజీ  1930-31 లో  జరిపిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ నేపధ్యంలో నటుడు జగ్గయ్య నిర్మించిన చిత్రం పదండి ముందుకు (1962). ఈ చిత్రంలో చిన్న వేషం వేసే అవకాసం కృష్ణకు లభించింది. సినిమాల్లో ఆయన తొలి వేషం ఇదే. జగ్గయ్య ఈ సినిమాలో కొంత భాగం తెనాలిలో షూటింగ్ చేసారు. అక్కడ ఒక సన్నివేశంలో వాలంటీర్లు అవసరం అయ్యారు. ఎవరైనా కుర్రాళ్లు కావాలని ఎంక్వైరీ చేస్తూంటే అక్కడివాళ్లు  బుర్రిపాలెం నుంచి కృష్ణను రప్పించారు. అదో ఊరేగింపు సన్నివేశం. డైలాగులేమీ ఉండవు. జాతీయ పతాకాన్ని ఎగరేసే స్వాతంత్య్ర పిపాసిగా కృష్ణ కనిపించారు.  స్వాతంత్య్రోద్యమం ఇతివృత్తం కావటంతో ఈ చిత్రం అప్పట్లో జనాలను బాగానే ఆకర్షించింది.

అంతకు ముందు కృష్ణకు ఎల్వీ ప్రసాద్ నుంచి కొడుకులు -కోడళ్లు సినిమాలో నటించమంటూ ఆఫర్ వచ్చింది. వెంటనే బయిలుదేరి చెన్నై వెళ్లారు. ఈ సినిమాలో నలుగురు కొడుకులు పాత్రలకు గానూ బాలయ్య, రమణమూర్తి, శోభన్ బాబు, కృష్ణను ఎంపికచేసారు ఎల్వీ ప్రసాద్. హీరో అవకాసం అనుకుని వచ్చిన కృష్ణకు నలుగురు హీరోల్లో ఒకడనే సరికి నిరుత్సాహం కలిగింది. సరే వెనకడుగు వేయటం ఎందుకని సరే అన్నారు.  నెలరోజులు రిహార్సిల్స్ లో పాల్గొన్నారు. తీరా షూటింగ్ మొదలయ్యే సమయానికి కొత్తవాళ్లతో రిస్క్ ఎందుకు అనుకున్నారో ఏమో వెనక్కి తగ్గారు. అయితే చిత్ర నిర్మాణం ఆగిపోయిందని చెప్పకుండా  ఇంకా టైమ్ పడుతుంది..మీరు వెళ్లండి..కబురు చేస్తాం అన్నారు. మిగిలిన ముగ్గురు అప్పటికే సినిమాల్లో చేస్తూండటంతో వాళ్లు పెద్దగా బాధపడిందేమీ లేదు. కానీ కృష్ణకు మాత్రం పూర్తి నిరుత్సాహం వచ్చేసింది. తొలి సినిమా ఇలా చేజారిపోయిందేమిటా అని బాధపడ్డారు. ఆ తర్వాతే జగ్గయ్య సినిమా వచ్చింది.

ఇక పదండి ముందుకు తర్వాత కృష్ణ..కులగోత్రాలు, మురళీకృష్ణ లాంటి సినిమాల్లో నటించినా, తేనె మనసులు తో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూసుకోలేదు.

(రిఫెరెన్స్ ...ప్రముఖ జర్నలిస్ట్ వినాయకరావు గారు రాసిన దేవుడులాంటి మనిషి పుస్తకం.)