స్టార్ కమెడియన్ సునీల్ హీరోగా టర్న్ అయ్యాక తన కెరీర్ అప్ అండ్ డౌన్స్‌తో కంటిన్యూ అవుతూ వస్తోంది. మర్యాదరామన్న, పూలరంగడు లాంటి హిట్స్ అందుకున్న సునీల్ తర్వాత వచ్చిన సినిమాలు ఏవీ ఆడలేదు.  వరుస ఫ్లాఫ్ లతో సతమతమవుతున్నా  సునీల్ మాత్రం ఎక్కడా కాన్ఫిడెన్స్ పోగొట్టుకోకుండా వరుసగా సినిమాలను చేస్తూనే ఉన్నాడు. తాజాగా మరో సినిమాను మొదలుపెట్టేశాడు. అయితే ఈ సారి కమిడియన్ గానో, హీరోగానో కాదు..విలన్ గా కనిపించి అలరించనున్నారు. సునీల్ విలన్ గా నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ ‘కలర్‌ ఫొటో’. ఈ చిత్రం వివరాలను యూనిట్  ప్రకటించింది.

సుహాస్‌, సందీప్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కలర్‌ ఫొటో’. ఈ చిత్రానికి సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వ్యవహరిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో సునీల్‌ విలన్ గా ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను నేచురల్‌ స్టార్‌ నాని ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు.

‘‘కలర్‌ ఫొటో’ చిత్రాన్ని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో టాలెంట్ ఉన్న వీళ్లు తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం నేనెంతో ఇంట్రస్ట్ గా ఎదురుచూస్తున్నాను. ఫస్ట్‌లుక్‌తోనే ఈ టీమ్ ఆకట్టుకుందని భావిస్తున్నాను’ అని నాని పేర్కొన్నారు. సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సాయిరాజేష్ నీలం, బెన్ని ముప్పానేని నిర్మిస్తున్నారు.  హృదయకాలేయం, కొబ్బరిమట్ట చిత్రాలను రూపొందించిన సాయి రాజేష్ ఈ ప్రాజెక్టులో ఉండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.