యంగ్ హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తున్న తాజా సినిమా ‘తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్‌’ (‘కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ అనేది ట్యాగ్‌లైన్‌). జి. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో... హన్సిక హీరోయిన్ గా చేస్తోంది. ఈ  చిత్రాన్ని నవంబరు 15న విడుదల చేయబోతున్నారు. ఈ నేపధ్యంలో చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ మొత్తం పూర్తి ఫన్నీ సన్నివేశాలతో సాగుతోంది. అలాగే ‘సివిల్‌ కేసులు కాంప్రమైజ్‌ చేయొచ్చు.. క్రిమినల్‌ కేసులు కావు.. నేరస్థులకు శిక్ష పడాల్సిందే.. ఈ కేసు విషయంలో నో కాంప్రమైజ్‌..’ అంటూ సందీప్‌ చెప్పే డైలాగుతో సినిమాలో యాక్షన్ కూడా సమపాళ్లలో ఉందని అర్దమవుతోంది. డైలాగులు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయని ట్రైలర్ చూస్తే అర్దమవుతోంది.

‘నిను వీడని నీడను నేనే’ తో సీరియస్ హిట్ కొట్టిన సందీప్ కిషన్‌.. ఈ సినిమాతో అందరినీ నవ్వించి మరో హిట్టుని ఈజీగా తన ఖాతాలో వేసుకోనున్నాడనేది ఈ ట్రైలర్‌తో తెలిసిపోతుంది. కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్, మెసేజ్ ఇలా అన్నీ సమపాళ్లలో ఈ చిత్రంలో ఉన్నాయని తెలిసేలా ట్రైలర్ కట్ చేయటంతో..సినిమా సగం సక్సెస్ అయినట్లే.

ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా కూడా సందీప్ కిషన్ వ్యవహరించాడు. ఆయన జోడీగా హన్సిక నటించగా, కీలకమైన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనుంది.  ముర‌ళీ శ‌ర్మ, బ్రహ్మానందం, వెన్నెల‌ కిశోర్‌, ప్రభాస్ శ్రీను త‌దిత‌రులు మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌.ఎన్‌.ఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జ‌గ‌దీష్ నిర్మిస్తున్నారు. ఇక సందీప్ కిషన్ తదుపరి చిత్రంగా 'A1 ఎక్స్ ప్రెస్' సెట్స్ పైకి వెళుతోంది. 'నట్పు తునై' అనే తమిళ హిట్ మూవీకి ఇది రీమేక్.