ప్రపంచాన్నే వణికించేస్తున్న కరోనా మహమ్మారి మానవాళిని వణికిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనాపై యుద్ధానికి యావ‌త్ భార‌త‌దేశం న‌డుం బిగించింది. ఈ పోరాటంలో మేము సైతం అంటూ సెలబ్రిటీలు కూడా చేయికలుపుతున్నారు. తమకు తోచినంత ఆర్థిక సాయం ప్రకటిస్తూ మరింత మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్‌, పవన్‌ కళ్యాణ్, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ లతో పాటు మరికొంత మంది తమ సాయన్ని ప్రకటించగా తాజాగా స్టైలిస్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా ఈ లిస్ట్ లో చేరిపోయాడు.

అయితే అందరు హీరోలు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రానికి తమ విరాళాలను ప్రకటిస్తే.. అల్లు అర్జున్ మాత్రం కేరళకు కూడా తన సాయాన్ని ప్రకటించాడు. అయితే అందుకు ప్రత్యేక మైన కారణం కూడా ఉంది. అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు మాలీవుడ్ లోనూ భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. బన్నీ సినిమాలన్నీ అక్కడ కూడా భారీగా రిలీజ్ అవుతుంటాయి. అందుకే బన్నీ అక్కడ ఉన్న తన అభిమానుల కోసం కూడా ఈ సాయాన్ని ప్రకటించాడు.

అన్ని ప్రాంతాలకు కలిపి 1.25 కోట్లు విరాళం అందిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించాడు బన్నీ. ఈ మొత్తంలో 50 ల‌క్ష‌లు ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి రిలీఫ్ ఫండ్ కు మ‌రో 50 ల‌క్ష‌లు తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి, మ‌రో 25 ల‌క్ష‌లు కేర‌ళ ముఖ్య‌మంత్రి రిలీఫ్ ఫండ్ కు అందిస్తున్నారు. గ‌తంలో కూడా ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఆర్ధిక సహాయం అందించారు అల్లు అర్జున్. కేర‌ళ వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న‌ప్పుడు 25 ల‌క్ష‌లు, చెన్నై వ‌ర‌ద‌లు వ‌చ్చిప్ప‌డు 25 ల‌క్ష‌లు విరాళాలు అల్లు అర్జున్ అందించిన సంగ‌తి తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేసిన అల్లు అర్జున్ `దేశ ప్ర‌ధాని మోదీ గారు రాష్ట్రా ముఖ్య‌మంత్రుల ఆదేశాలు మేర‌కు 21 రోజులు లాక్ డౌన్ ని మనంద‌రం క‌చ్ఛితంగా పాటిద్ధాం. మనకోసం ఎలాంటి ప్రమాదాన్ని లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారులకి, డాక్టర్లకి, అలానే కరోనా నివారణకు కృషి చేస్తున్న ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలానే వివిధ రాష్ట్రాల్లో ఉన్న నా అభిమానుల‌తో పాటు ప్ర‌జ‌లంతా ఇళ్లకే పరిత‌మై క‌రోనా నివార‌ణ‌కు ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించి, ఈ ఘోర విప‌త్తు నుంచి అంద‌రం బ‌య‌ట‌ప‌డాల‌`ని ఆకాంక్షించారు.