'అల.. వైకుంఠపురములో' సినిమాలో క్లైమాక్స్ కి ప్రాణం పోసింది 'సిత్తరాల సిరపడు' అనే జానపద గేయం. అయితే ఈ పాటని ఎవరు రాశారు..? ఎక్కడ నుండి పుట్టిందనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఈ పాటకి సంబంధించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

నిజానికి ఈ పాట రాసింది ఓ ఎల్ఐసీ ఉద్యోగి. మచిలీపట్నం ఎల్ఐసీ డివిజన్ కార్యాలయంలో మేనేజర్ గా పని చేస్తున్న బల్లా విజయకుమార్ అనే వ్యక్తి ఈ పాటని రాశారు. ఈ పాటకి విపరీతమైన ప్రేక్షకాదరణ రావడంతో విజయకుమార్ కూడా బాగానే ఫేమస్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని విషయాలను మీడియాతో చెప్పుకొచ్చారు.

త్రివిక్ర‌మ్ కొత్త సినిమా టైటిల్ అదేనా..?

తనకు జానపద గేయాలంటే చాలా ఇష్టమని.. చిన్న చిన్న గజల్స్ రాయడమంటే ఇష్టమని.. ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే రాసి ఇస్తుంటానని చెప్పారు. ఈ క్రమంలో సిరివెన్నెల సోదరుడితో పరిచయం ఏర్పడిందని.. ఆయన ద్వారా 'అల.. వైకుంఠపురములో' సినిమాలో జానపద గేయం కావాలని దర్శకుడు త్రివిక్రమ్ తన బృందంతో ఆరా తీయించారని గుర్తు చేసుకున్నారు.

ఈ పాట కోసం శ్రీకాకుళంలో ప్రజాదరణ పొందిన జానపద గేయాలను అన్వేషించామని.. 'దువ్వందొర' అనే పాట దొరికిందని.. అది సరిపోతుందని చెప్పినా.. సందర్భానికి తగ్గట్లు లేదని చెప్పడంతో.. తనే ఒక పల్లవి, ఎనిమిది చరణాలు రాసిచ్చినట్లు తెలిపారు. ఆ పాట త్రివిక్రమ్ నచ్చడంతో కొంచెం మార్పులు చేసి సినిమాలో పెట్టారని తెలిపారు.

శ్రీకాకుళంలో పదాలు ఉండాలనే ఉద్దేశంతో.. పాటలో 'పీపలు, బొగతోడు' లాంటి పదాలు వాడినట్లు చెప్పారు. 'సిరపడు' అనే పదాన్ని శ్రీకాకుళంలో పెంకితనం, అల్లరి పిల్లలను ఉద్దేశించి ఎక్కువగా వాడుతుంటారని చెప్పారు. కరణాల భాష వేరుగా ఉంటుందని.. వాళ్లకి కోడ్స్ ఉంటాయని చెప్పారు.

అలానే విశ్వబ్రాహ్మణులకు కూడా కోడ్స్ ఉంటాయని 'సిరపడు' అనే పదాన్ని వాళ్లు కూడా వాడుతుంటారని చెప్పారు. కస్టమర్లను గుర్తుపెట్టుకోవడానికి వాళ్లు ఆ పదాన్ని విరివిరిగా వాడుతుంటారని చెప్పారు. 'సిరపడు' అంటే 'పెద్దగా బలం లేదు.. అయినా చురుకైన వ్యక్తిగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాడు. మంతనాలు, పెత్తనాలు చేస్తుంటాడు' అని అర్ధమని చెప్పుకొచ్చారు.