హిందీ, తమిళం, మలయాళం భాషల్లో సల్మాన్, కమల్ హాసన్, మోహన్ లాల్ లాంటి సీనియర్ హీరోలు హోస్ట్ లుగా వ్యవహరించారు. కానీ తెలుగులో మాత్రం తొలి రెండు సీజన్లకు ఎన్టీఆర్, నాని లాంటి యువకులు హోస్టింగ్ చేశారు. తొలిసారి బిగ్ బాస్ 3 ద్వారా సీనియర్ హీరో నాగ్ హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. 

హోస్ట్ గా ఉన్న వ్యక్తి హుందాగా నడుచుకోవాలి.. మంచి వాక్చాతుర్యం ఉండాలి. ఇలాంటి విషయాల్లో నాగార్జునకు ఎలాంటి వంకర్లు పెట్టలేం. అంచనాలకు తగ్గట్లుగానే నాగార్జున హోస్ట్ గా అదరగొట్టాడు. బిగ్ బాస్ 3 ఆరంభంలో ఈ షోకి మంచి అటెన్షన్ ఏర్పడింది. మధ్యలో కాస్త చప్పగా అనిపించినా.. షో చివరికి వచ్చే సరికి మళ్ళీ పుంజుకుంది. 

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఐదుగురు సభ్యులలో విజేత ఎవరో తేల్చడం ప్రేక్షకులకు టఫ్ ఛాయిస్. విజేతగా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఆదివారం రోజు బాగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే కి సిద్ధం అవుతోంది. ఈ తరుణంలో బిగ్ బాస్ 3ని ప్రసారం చేస్తున్న స్టార్ మా సంస్థ అరుదైన రికార్డ్ ని దక్కించుకుంది. 

స్టార్ మా ఛానల్ పాపులారిటీలో దేశంలోనే మూడవ స్థానం దక్కించుకుంది. దీనికి కారణం నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3 దూసుకుపోతుండడం అని స్టార్ మా వర్గాలు అంటున్నాయి. ప్రధమ స్థానంలో బీహార్ కు చెందిన దంగల్ టివి ఉండగా, రెండవ స్థానంలో తమిళనాడుకు చెందిన సన్ టివి ఉంది. 

గతంలో స్టార్ మా టాప్ 10లో ఉండేది. కానీ నాగార్జున పుణ్యమా అని 3వ స్థానానికి ఎగబాకినట్లు స్టార్ మా వర్గాలు వెల్లడించారు. ఓ తెలుగు ఛానల్ దేశంలో మూడవ స్థానానికి చేరుకోవడం సాధారణమైన విషయం కాదు.  నాగ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3 షోకు ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి రేటింగ్స్ నమోదవుతున్నాయని స్టార్ మా అంటోంది. 

ప్రస్తుతం బిగ్ బాస్ 3కి 1108 గ్రాస్ రేటింగ్ పాయింట్స్(JRP)తో దూసుకుపోతోంది. నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా సరదాగా ఉంటూనే.. కంటెస్టెంట్స్ తప్పులు చేసిన సమయంలో మందలించారు. ప్రతి ఒక్క కంటెస్టెంట్ పై ఫోకస్ పెడుతూ షోని నడిపించారు. 

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 3లో రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, అలీ రెజా ఫైనల్స్ కు చేరారు. వీరిలో విజేత ఎవరు అనేది ఆదివారం తేలనుంది.