దర్శకధీరుడు రాజమౌళి తరువాత టాలీవుడ్‌ లో ఫ్లాప్‌ ఎరగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్‌ కొరటాల శివ. కెరీర్ వరుసగా అన్ని సినిమాలు సూపర్ హిట్లుగా మలచిన ఈ స్టార్ డైరక్టర్‌ ఇప్పటిక వరకు చేసింది కేవలం నాలుగు సినిమాలు మాత్రమే. ప్రస్తుతం టాలీవుడ్ టాప్‌ డైరెక్టర్లలో ఒకడిగా ఉన్న కొరటాల శివ ఆల్రెడీ తన రిటైర్మెంట్‌కు సంబంధించిన ప్రకటన కూడా ఇచ్చేశాడు. దీంతో అభిమానులు షాక్ అవుతున్నారు. భారీ ఇమేజ్ తో పాటు ఎంతో కెరీర్ ఉన్నా ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఏంటి అని  షాక్ అవుతున్నారు.

2013లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు కొరటాల శివ. ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోల దృష్టిలో పడ్డాడు. ఆ తరువాత శ్రీమంతుడు,  జనతా గ్యారేజ్‌, భరత్ అనే నేను  సినిమాలను తెరకెక్కించాడు. ఈ సినిమాలన్నీ సూపర్‌ హిట్ కావటంతో కొరటాల ఇమేజ్‌ తారా స్థాయికి చేరింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమాను రూపొందిస్తున్నాడు కొరటాల.

ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే కీలక ప్రకటన చేశాడు దర్శకుడు కొరటాల శివ. ఇటీవల మీడియా సంస్థతో మాట్లాడిన కొరటాల శివ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను కెరీర్ మొత్తం మీద కేవలం 10 సినిమాలు మాత్రమే చేయాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్టుగా చెప్పాడు. కెరీర్‌ పీక్‌ స్టేజ్‌లో ఉండగానే ఓ స్టార్ డైరెక్టర్‌ రిటైర్మెంట్ ప్రకటించటం ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొరటాల మాత్రం కొత్త వాళ్లు రావాలంటే పాత దర్శకులు రిటైర్ కావాల్సిందే అంటున్నాడు.

అయితే తాను దర్శకుడిగా రిటైర్‌ అయినా.. రచయితగా, నిర్మాతగా ఇండస్ట్రీలోనే కొనసాగుతా అంటున్నాడు ఈ స్టార్ డైరెక్టర్‌. ఇక ఆచార్య విషయానికి వస్తే చిరంజీవి నక్సలైట్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా దసరగా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.