లాక్‌ డౌన్‌ కారణంగా సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితం కావటంతో రకరకాల చాలెంజ్‌లు తెర మీదకు వస్తున్నాయి. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీ వర్క్‌ అవుట్స్ విషయంలో సరికొత్త టార్గెట్‌లు పెట్టుకుంటుండగా అందాల భామలు టీషర్ట్‌ ఛాలెంజ్‌లతో హల్‌ చల్‌ చేస్తున్నారు. తల కిందులుగా టీ షర్ట్‌ వేసుకుంటూ అందాల భామలు పోస్ట్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అయితే తాజాగా మరో కొత్త చాలెంజ్‌కు తెర తీశాడు దర్శక ధీరుడు రాజమౌళి.

లాక్‌ డౌన్‌ కారణంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్ ఆగిపోవటంతో రాజమౌళి కూడా ఇంటికే పరిమితమయ్యాడు. అయితే ఈ సమయంలో కూడా ఆర్ ఆర్ ఆర్‌ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానిచ్చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ చేసిన పార్ట్ అంతా ఎడిటింగ్ కూడా పూర్తి చేసేశాడు రాజమౌళి. దీంతో రాజమౌళి కాస్త ఫ్రీ అయ్యాడు. ఈ సమయంలో అర్జున్‌ రెడ్డి ఫేం సందీప్‌ రెడ్డి వంగా రాజమౌళికి ఓ చాలెంజ్‌ చేశాడు. ఇంటి పనిచేస్తూ నిజమైన మగాడు అనిపించుకోవాలని చాలెంజ్‌ చేశాడు. చాలెంజ్‌ను యాక్సెప్ట్ చేసిన జక్కన్న ఈ రోజు ఆ పని పూర్తి చేశాడు.

ప్రస్తుతం మీడియాతో వరుసగా ఇంటరాక్ట్‌ అవుతున్న జక్కన్న తాజాగా తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశాడు. బీ ద రియల్‌ మెన్‌ (అసలైన మగాడిగా నిరూపించుకో) అంటూ తాను ఇంటి పనులు చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. ఇళ్లు ఊకటం, తుడవటంతో పాటు విండోలు, తలుపులు తానే స్వయంగా క్లీన్ చేశాడు రాజమౌళి. అయితు ఈ వీడియోను పోస్ట్ చేసిన జక్కన్న ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను కూడా ఇంటి పనులు చేయాల్సిందిగా చాలెంజ్‌ చేశాడు. అంతేకాదు అన్న కీరవాణి, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకుడు సుకుమార్‌లకు కూడా ఇదే చాలెంజ్‌ను విసిరాడు. అయితే ఈ చాలెంజ్‌కు తాను సిద్ధం అంటూ ఇప్పటికే ఎన్టీఆర్‌, శోభులు చాలెంజ్‌ను యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.