తనుశ్రీ దత్తా అందించిన ధైర్యంతో అన్ని చిత్ర ప్రరిశ్రమల్లో నటీమణులు తమపై జరిగిన లైంగిక వేధింపులు, అవమానాలని బయటపెట్టారు. మీటూ ఉద్యమం ఫలితంగా చాలా మంది దర్శకులు, నిర్మాతలు, నటులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. కొందరు నటులులని, దర్శకులని సినిమాల నుంచి తప్పించిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అంతలా ఇండియాలో మీటూ ఉద్యమం ప్రభావం చూపించింది. 

ఇక కన్నడ నటి శృతి హరిహరన్ కూడా మీటూ ఉద్యమంలో భాగంగా సీనియర్ హీరో అర్జున్ పై తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓ చిత్ర షూటింగ్ లో భాగంగా అర్జున్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని శృతి హరిహరన్ ఆరోపించింది. అర్జున్ పై కేసు కూడా నమోదు చేసింది. శృతి ఆరోపణలని అర్జున్ ఖండించడం, అతడు కూడా ఆమెపై పరువునష్టం దావా వేయడం చాలా తతంగం నడిచింది. 

దీనిపై శృతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మీటూ వ్యవహారాలకు ఎలాంటి ఆధారాలు ఉండవు. మనం ధైర్యంగా పోరాటం చేయాలి. నేను కూడా అదే చేస్తున్నా అని శృతి తెలిపింది. మీటూ కామెంట్స్ తర్వాత తనకు చిత్ర పరిశ్రమలో అవకాశాలు రావడం లేదని శృతి పేర్కొంది. అయినా కూడా నాకొచ్చిన నష్టం లేదు. ప్రస్తుతం నేను భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్నా. 

సినిమా అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తా అని శృతి తెలిపింది. నా పై జరిగిన వేధింపులని బయట పెట్టినందుకు నాకు ఎలాంటి సిగ్గు లేదు. పైగా గర్వంగా కూడా ఉంది. నా జరిగిన వేధింపులు మరో నటికి జరగకూడదు. అందుకే నటీమణులు ఎలాంటి సంఘటనని అయినా ధైర్యంగా ప్రతిఘటించాలి అని శృతి కోరింది.