ప్రస్తుతం బిగ్ బాస్ గెలుపు కోసం బాబా భాస్కర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, రాహుల్, అలీ రెజా పోటీ పడుతున్నారు. సోషల్ మీడియాలో వీరందరికి వారి వారి అభిమానులు ఆర్మీలుగా మారారు. ముఖ్యంగా శ్రీముఖి సోషల్ మీడియా టీం ఆమెకు పబ్లిసిటీ కల్పిస్తూ ప్రమోషన్స్ తో దూసుకుపోతోంది. 

శ్రీముఖి ముందుగా తన సోషల్ మీడియా టీంని ఏర్పాటు చేసుకుని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయింది. ఆమెపై ఆసక్తి పెరిగేలా సోషల్ మీడియాలో ప్రచారాలు సాగుతున్నాయి. ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ ఆడియన్ ఓట్లు వేస్తేనే విజేతగా నిలిచే అవకాశం ఉంటుంది. 

తాజాగా శ్రీముఖి సోషల్ మీడియా టీం ఆమె గెలుపు కోసం అదిరిపోయే ప్లాన్ వేశారు. శ్రీముఖి సోషల్ మీడియా టీం 'రాములమ్మ'అనే పేరుతో ఓ కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అభిమానులంతా ఒసేయ్ రాములమ్మా చిత్రంలోని పాటకు శ్రీముఖి డాన్స్ చేసే విధంగా స్టెప్పులేసి ఆ వీడియోని పంపించాలి. 

ఆ వీడియోకు సోషల్ మీడియాలో 'ThisTimeWoman', 'VoteForSreemukhi' అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించాల్సి ఉంటుంది. ఇందులో ఉత్తమమైన వీడియోల్ని ఎంపిక చేసి వారికీ శ్రీముఖితో కలసి డాన్స్ చేసే అవకాశాన్ని కల్పిస్తారు. ఈ విధంగా శ్రీముఖి టీం ఓటర్లకు గాలం వేయడానికి ప్రయత్నిస్తోంది. వారి ప్రయత్నాలు ఈమేరకు ఫలిస్తాయో.. శ్రీముఖి బిగ్ బాస్ టైటిల్ గెలుచుకుంటుందో లేదో అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.