100 రోజులకు పైగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ముగింపు దశకు చేరుకుంది. నాగార్జున హోస్ట్ గా సీజన్ 3లో అలరించారు. ఆదివారం రోజు జరగబోయే గ్రాండ్ ఫినాలేపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. మొత్తం ఐదుగురు సభ్యులు టైటిల్ బరిలో నిలిచారు. 

బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, శ్రీముఖి, రాహుల్, అలీ రెజా బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. అలీ రెజా ఎలిమినేటి అయి తిరిగి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. కాబట్టి అతడు టైటిల్ గెలుచుకునే అవకాశాలు తక్కువ. ఇక మిగిలిన నలుగురిలో తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. 

కానీ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం శ్రీముఖి, రాహుల్ కాస్త ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. బాబా భాస్కర్, వరుణ్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. మొత్తంగా విజేత ఎవరనేది చివరి నిమిషం వరకు సస్పెన్సే. తమ అభిమాన కంటెస్టెంట్స్ గెలుపు కోసం ఆడియన్స్ ఓటింగ్ చేస్తున్నారు. 

కొందరు సెలెబ్రిటీలు తమ స్నేహితులకు మద్దతు తెలుపుతున్నారు. హౌస్ లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. శ్రీముఖి సోషల్ మీడియా టీం మాత్రం దూసుకుపోతోంది. విన్నూతమైన ప్రచార పద్దతులతో ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 

ఇప్పటికే శ్రీముఖి సోషల్ మీడియా టీం 'రాములమ్మ' పేరుతో ఓ కాంటెస్ట్ నిర్వహించారు. తాజాగా శ్రీముఖి అభిమానులు కొందరు ఆమెపై సైరా చిత్రంలోని టైటిల్ సాంగ్ ని పేరడీ చేశారు. ఈ సాంగ్ ని శ్రీముఖి సోషల్ మీడియా టీం పోస్ట్ చేసింది. శ్రీముఖిని పొగుడుతూ, ఆమె బిగ్ బాస్ హౌస్ లో పోరాడిన విధానాన్ని కీర్తిస్తూ ఉన్న ఈ పాట అభిమానులని ఆకట్టుకుంటోంది. బిగ్ బాస్ 3 విన్నర్ శ్రీముఖినే అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 

తొలి రెండు సీజన్లలో పురుషులే విజేతలుగా నిలిచారు. తొలి సీజన్ లో నటుడు శివ బాలాజీ టైటిల్ ఎగరేసుకుపోగా, రెండవ సీజన్ లో కౌశల్ విజేతగా నిలిచాడు. దీనితో ఏఈ సారి మహిళ విజేతగా నిలవాలి అంటూ శ్రీముఖి అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. శ్రీముఖి బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తుందా లేక ఈసారి కూడా పురుషులే బిగ్ బాస్ టైటిల్ ఎగరేసుకుపోతారా అనేది ఆదివారం తేలిపోనుంది.