కొత్త బంగారు లోకం సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆ సినిమాతో ఎంతో మంది హీరోలను ఆకర్షించిన శ్రీకాంత్ ఊహించని విధంగా మహేష్ - వెంకటేష్ లాంటి హీరోలతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేశాడు. ఒక దర్శకుడిగా శ్రీకాంత్ మహేష్ ని ఎక్కువగా ఆకర్షించాడు. అందుకే సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు.

మహేష్ తో బ్రహ్మోత్సవం అనే సినిమా చేసిన శ్రీకాంత్ అప్పటివరకు ఉన్న క్రేజ్ ని పోగొట్టుకున్నాడు. ఆ సినిమా దారుణంగా దెబ్బకొట్టింది. ఆ సినిమా అనంతరం మరో సినిమా సెట్స్ పైకి తేవడానికి చాలా సమయం పట్టింది. మొత్తానికి వెంకటేష్ తో నారప్ప సినిమాను మొదలెట్టాడు. అయితే ఇంకా ఫామ్ లోకి రాకముందే శ్రీకాంత్ కి మరో కుర్ర హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతనెవరో కాదు మెగా హీరో వరుణ్ తేజ్. వరుణ్ మొదటి సినిమాకు (ముకుంద) శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

ఆ సినిమా అనుకున్నంతగా విజయాన్ని అందుకోకపోయినప్పటికీ వరుణ్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక చాలా కాలం తరువాత శ్రీకాంత్ వరుణ్ కి మరో కథను వినిపించాడట. కథ నచ్చడంతో మెగా హీరో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఒక సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత క్రిష్ తో మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. శ్రీకాంత్ నారప్ప సినిమా అనంతరం వరుణ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.