ఇటీవల మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా దేశ ప్రధాని నరేంద్రమోదీ కొందరు ప్రముఖుల కోసం ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అక్టోబర్ 29న జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ సెలబ్రిటీలు తప్ప, సౌత్ అగ్ర తారలు కనిపించలేదు.

వారికి ఆహ్వానాలు అందకపోవడం, ఆ కార్యక్రమానికి హాజరైన సౌత్ సెలబ్రిటీల ఫోటోలు బయటకి రాకపోవడంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా అసహనం వ్యక్తం చేశారు. ఉపాసన, ఖుష్బూ, పూరి జగన్నాథ్ ఇలా చాలా మంది మోదీ తీరుపై విమర్శలు గుప్పించారు.

ఉపాసన ఎఫెక్ట్: చిరంజీవి, రాంచరణ్ ని ఆహ్వానించిన మోడీ!

దక్షిణాది తారలను తక్కువగా చూడడం సరికాదని, ఇలా పక్షపాత ధోరణితో వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. తాజాగా ఈ విషయంపై దక్షిణాది పాపుక్లార్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్పందించారు. ఎస్పీబీ.. మోదీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కానీ అక్కడ ఎదురైన సంఘటనను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రామోజీరావు కారణంగా మోదీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తనకు దక్కిందని.. అందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమానికి హాజరైన తమని ఎంట్రన్స్ దగ్గర ఆపి సెక్యురిటీ వాళ్లు ఫోన్లు తీసుకున్నారని.. ఫోన్లు వారికిచ్చిన తరువాతే లోపలకి పంపించారని.. టోకెన్లు కూడా ఇచ్చారని.. కానీ లోపలకి వెళ్లేసరికి స్టార్స్ అంతా మోదీతో తమ సెల్ ఫోన్లలో సెల్ఫీలు దిగుతున్నారని.. ఈ సంఘటన బాధకి గురిచేసిందని సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.