ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్.. ప్రముఖ మ్యూజిక్ కంపెనీ టీ-సిరీస్ యజమాని భూషణ్ కుమార్‌ను తనతో పెట్టుకోవద్దంటూ హెచ్చరించాడు. తన పేరును ప్రస్తావించి కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడు. ఇటీవల.. సుశాంత్ రాజ్‌పుత్ సింగ్ ఆత్మహత్య అనంతరం.. బాలీవుడ్‌లో బ్యాగ్రౌండ్ లేనివారిని ఎదగనివ్వరని తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో సోనూ నిగమ్ కూడా మ్యూజిక్ ఇండస్ట్రీ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.

 మూవీ మాఫియా మాదిరిగానే మ్యూజిక్ మాఫియా కూడా బాలీవుడ్‌లో ఉందని.. ఆ మూడునాలుగు మ్యూజిక్ కంపెనీలే సింగర్లను నిర్ణయించి.. శాసిస్తాయని సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యలు మ్యూజిక్ కంపెనీలకు పరోక్షంగా చిర్రెత్తుకొచ్చేలా చేశాయి. 

బాలీవుడ్‌లో ఆరుగురు సింగర్లు సోనూ నిగమ్ వ్యాఖ్యలను ఖండించారు. బాలీవుడ్‌లో అలాంటిదేమీ లేదని చెప్పుకొచ్చారు. మ్యూజిక్ కంపెనీలను వెనకేసుకొచ్చేలా వ్యాఖ్యలు చేసిన ఆ ఆరుగురు సింగర్లను.. అర్మాన్ మాలిక్‌తో సహా సోనూ తప్పుబట్టాడు. అంతేకాదు.. భూషణ్ కుమార్‌ను తీవ్ర స్థాయిలో హెచ్చరించాడు. ఇప్పుడు తాను భూషణ్ కుమార్ పేరును ప్రస్తావించాల్సిన అవసరం ఉందని తన వీడియో వ్లాగ్‌లో చెప్పాడు. తన ఇంటికొచ్చి ఒక ఆల్బమ్ చేయమని అడిగిన రోజులను భూషణ్ మర్చిపోయాడని సోనూ వీడియోలో వ్యాఖ్యానించాడు. సుభ్రతా రాయ్, స్మితా థాక్రే, బాల్ థాక్రేకు పరిచయం చేయమని తనను అడిగిన రోజులను, అబూ సలేం నుంచి కాపాడమని అడిగిన రోజులను భూషణ్ మర్చిపోయినట్లు ఉన్నాడని సోనూ వీడియోలో ప్రస్తావించాడు. ఇవన్నీ గుర్తుంటే.. తనతో పెట్టుకోవద్దని హెచ్చరించాడు.

మరీనా కువార్ గుర్తుండే ఉంటుందని ఆశిస్తున్నానని, తాను ఎందుకు ముందుకు రావడం లేదో తెలియడం లేదని వ్యాఖ్యానించాడు. నా దగ్గర ఆమె వీడియో ఇప్పటికీ ఉందని, నాతో పెట్టుకుంటే ఆ వీడియోను యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తానని సోనూ నిగమ్ హెచ్చరించాడు. తనతో పెట్టుకునే ధైర్యం చేయొద్దని సోనూ నిగమ్ భూషణ్ కుమార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు.