అజ్ఞాతవాసి సినిమా తరువాత రాజకీయాల్లో బిజీగా కావటంతో సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చారు పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్. ఒక దశలో పవన్‌ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాడన్న టాక్ కూడా వినిపించింది. అయితే రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేకపోవటంతో తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు పవర్‌ స్టార్. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాను తెలుగులో వకీల్‌ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. బోనీ కపూర్‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు.

ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్‌ డౌన్‌ కారణంగా ఆగిపోయింది. అయితే ఈ సినిమాలో పవన్‌కు జోడిగా శృతిహాసన్ నటిస్తుందన్న వార్తలు వినిపించాయి. ఒరిజినల్ వర్షన్‌లో హీరోకు జోడి లేకపోయినా తెలుగుతో పవన్‌ ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలో మార్పులు చేసి హీరోయిన్‌ రోల్‌ను యాడ చేశారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై శృతి క్లారిటీ ఇచ్చింది.

ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన శృతిహాసన్.. తాను తెలుగులో క్రాక్‌ సినిమా తప్ప మరే సినిమాలో కూడా నటించటం లేదని చెప్పింది. అంతేకాదు తనను తెలుగు దర్శక నిర్మాతలు ఎవరూ సంప్రదించలేదని చెప్పింది. గతంలో పవన్‌, శృతి హాసన్‌ గబ్బర్ సింగ్‌, కాటమరాయుడు సినిమాలో కలిసి నటించారు. వకీల్ సాబ్ కోసం మరోసారి వీరిద్దరు కలిసి నటిస్తున్నారన్న వార్తలు రావటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలకు శృతి ఫుల్‌ స్టాప్‌ పెట్టేసింది.