సినీ అభిమానులంతా యువ దర్శకుడు అట్లీ పేరు వినే ఉంటారు. తమిళ డైరెక్టర్ అయినప్పటికీ ప్రస్తుతం అట్లీ పేరు అంతటా మారుమోగుతోంది. అందుకు కారణం అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రాలే. రాజా రాణి, తేరి, మెర్సల్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో అట్లీ పరాజయమే లేకుండా దూసుకుపోతున్నాడు. 

బాలీవుడ్ స్టార్ షారుఖ్ సైతం అట్లీ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నాడంటే అతడి ప్రతిభని అర్థం చేసుకోవచ్చు. ఇళయదళపతి విజయ్ హీరోగా అట్లీ తెరకెక్కించిన బిగిల్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 25న బిగిల్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. 

బిగిల్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. మరోమారు అట్లీ సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ యువ దర్శకుడు అందుకుంటున్న పారితోషికం హాట్ టాపిక్ గా మారింది. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలతో అలరిస్తున్న అట్లీ బిగిల్ చిత్రానికి గాను 25 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు టాక్. 

త్వరలో అట్లీ కింగ్ ఖాన్ షారుఖ్ తో ఓ చిత్రం తెరకెక్కించబోతున్నాడు. ఆ చిత్రానికి 30 కోట్ల వరకు ఛార్జ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే సౌత్ లో ఉన్న అగ్ర హీరోలతో సమానంగా అట్లీ పారితోషికం అందుకుంటున్నట్లు అవుతుంది.