ఈ సంవత్సరం విడుదలైన ‘దొరసాని’ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమయ్యింది శివాత్మికా రాజశేఖర్‌.. జీవితారాజశేఖర్‌ కుమార్తె అయిన ఆమె తొలి చిత్రంతోనే నటిగా ప్రేక్షకుల మెప్పు పొందింది. అయితే  సినిమా ఆడకపోవటంతో ఆ తర్వాత చెప్పుకోదగ్గ ఆఫర్స్ ఏమీ ఆమె దగ్గరకు వెళ్లలేదు. వెళ్లిన ఒకటి రెండు ఆఫర్స్ ను జీవిత తిప్పి కొట్టిందని సమాచారం. ఈ క్రమంలో నెక్ట్స్ సినిమాగా ఏం చేద్దామనుకుంటున్న సమయంలో  ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో నటించే చాన్స్‌ వచ్చింది.  

అయితే కృష్ణవంశీ సైతం ఇప్పుడు ఫామ్ లో లేరు. కానీ ఆయనకు నటీనటుల్లో ఉన్న టాలెంట్ ని బయిటకు తీయగలడనే పేరు ఉంది. దాంతో జీవిత వెంటనే ఓకే చేసిందని సమాచారం. రెమ్యునేషన్ కూడా పట్టించుకోకుండా ఓకే చేసినట్లు సమాచారం. ఈ సినిమా తో శివాత్మిక అందరి దృష్టిలో పడుతుందని జీవిత భావిస్తోంది. గతంలో సోనాలి బింద్రే, ఛార్మి, కాజల్ ...కృష్ణ వంశీ సినిమాల్లో నటించిన తర్వాత పూర్తి స్దాయి బిజీ అయ్యారు.

ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులుగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రంగ మార్తాండ’. నానా పటేకర్‌ నటించిన మారాఠీ చిత్రం ‘నట సామ్రాట్‌’కు ఇది తెలుగు రీమేక్‌. ఈ సినిమాలో సింగర్ గా కనిపించబోతోంది శివాత్మిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో శివాత్మిక పాల్గొంటున్నారని తెలిసింది.

ఇందులో ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణల కూతురి పాత్రలో కనిపిస్తారట శివాత్మిక. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. బ్రహ్మానందం విభిన్న పాత్రలో కనిపించనున్న   ఈ సినిమాను రెడ్ బల్బ్ మూవీస్, ఎస్వీఆర్ గ్రూప్, హౌస్‌ఫుల్ మూవీస్ బ్యానర్స్‌పై.. అభిషేక్ జవకర్, మధు కలిపు నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతమందిస్తున్నారు.