బాలీవుడ్ అందాలతార శిల్పా శెట్టి కుటుంబానికి చిక్కులు మొదలయ్యాయి. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు ఇక్బాల్ తో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో శిల్పా శెట్టి కుటుంబానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పెద్ద షాక్ ఇచ్చింది. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు ఇక్బాల్ తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై విచారణ జరపాలని ఈడీ డిసైడ్ అయింది. దీనితో ఈడీ అధికారులు రాజ్ కుంద్రాకు నోటీసులు పంపారు. 

నవంబర్ 4న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. రాజ్ కుంద్రా, ఇక్బాల్ కు మధ్య పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. రంజీత్ సింగ్ బింద్రా అనే మధ్యవర్తి ద్వారా రాజ్ కుంద్రాకు, ఇక్బాల్ కు మధ్య 225 కోట్ల మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. 

రంజీత్ సింగ్ బింద్రా బడా రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్ గా చలామణి అయ్యాడు. అతడి సంస్థ నుంచి శిల్పా శెట్టి డైరెక్టర్ గా ఉన్న ఎసెన్షియల్ హాస్పిటాలిటీ లిమిటెడ్ అనే సంస్థకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు తమ వద్ద డేటా ఉందని ఓ సీనియర్ ఈడీ అధికారి ఆంగ్ల మీడియాకు తెలిపారు. 

దావూద్ ఇబ్రహీం సన్నిహితుడైన ఇక్బాల్ కు రాజ్ కుంద్రా అనేక మార్గాల ద్వారా ఆర్థిక లావాదేవీలు పెద్దమొత్తంలో జరిపారనే ఆరోపణలకు ఈడీ బలాన్ని చేకూరుస్తోంది. ఇదిలా ఉండగా ఇక్బాల్ 2013లో మరణించాడు. వీటన్నింటిపై నిజా నిజాల కోసం ఈడీ నవంబర్ 4న రాజ్ కుంద్రాని విచారించనుంది.