బాలీవుడ్ కింగ్ ఖాన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న షారుక్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గడిచిన మూడు దశాబ్దాల్లో జయాపజయాలతో సంబంధం లేకుండా తన క్రేజ్ ను పెంచుకున్నాడు. అందుకు సోషల్ మీడియా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా ఎకౌంట్స్ లో షారుక్ ఫాలోవర్స్ ని చూస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే.

ఇండియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన స్టార్ హీరోల్లో షారుక్ ఒకరిగా స్థానం సంపాదించుకున్నాడు. ఇంతకుముందు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ లో 38.8 మిలియన్ ఫాలోవర్స్ తో  టాప్ లో ఉన్నారు. ఇక సల్మాన్ ఖాన్ కి 38.3 మిలియన్ల ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. ఇక ఇప్పుడు షారుక్ ఖాన్ 39 మిలియన్ల ఫాలోవర్స్ తో వారి రికార్డ్ ని బ్రేక్ చేశారు.

ఇన్స్టాగ్రామ్ లో కూడా షారుక్ కి 18.6మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.  గత కొన్నేళ్లుగా షారుక్ కి విజయాలు లేవు. ఎన్నో ఆశలు పెట్టుకున్న పెద్ద పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.ముఖ్యంగా జీరో సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. దీంతో ఎన్నడు లేని విధంగా తరువాత కథను సెలెక్ట్ చేసుకోవడానికి షారుక్ చాలా సమయం తీసుకున్నారు. త్వరలోనే కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టడానికి షారుక్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మెర్శల్ - తేరి వంటి కథలతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న అట్లీ మరికొన్నిరోజుల్లో విజయ్ తో చేసిన బిగిల్ సినిమాని విడుదల చేయబోతున్నాడు. తెలుగులో విజిల్ టైటిల్ తో రిలీజ్ కాబోతోంది. దీపావళికి రానున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఆ సినిమా రిలీజ్ అనంతరం అట్లీ - షారుక్ ఖాన్ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది.