గతంలో ఎక్కువగా టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు పరభాషా కథలని అరువు తెచ్చుకుని రీమేక్ చేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగు చిత్రాలకు ఇతర భాషల్లో మంచి డిమాండ్ నెలకొంది. అర్జున్ రెడ్డి చిత్రాన్ని ఇప్పటికే హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేశారు. రంగస్ధలం, జెర్సీ చిత్రాలు కూడా ఇతర భాషల్లో రీమేక్ కాబోతున్నాయి. 

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి చిత్ర రీమేక్ లో నటించాడు. కబీర్ సింగ్ గా హిందీలో తెరకెక్కిన ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం షాహిద్ మరో తెలుగు చిత్ర రీమేక్ లో నటించబోతున్నాడు. అదే నాని నటించిన జెర్సీ చిత్రం. ఈ చిత్రం కోసం షాహిద్ కపూర్ కసరత్తు కూడా ప్రారంభించేసాడు. 

క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం షాహిద్ బ్యాట్ పట్టి మైదానంలోకి దిగాడు. షాదీ కపూర్ ఈ చిత్రం కోసం క్రికెట్ సాధన చేస్తున్నాడు. ఆ ఫోటో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

తొలిసారి జెర్సీ రీమేక్ గురించి షాహిద్ స్పందించాడు. కబీర్ సింగ్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే డైలమాలో ఉన్నా. కానీ జెర్సీ చిత్రం చూసిన ఒక్క నిమిషంలోనే నా నెక్స్ట్ మూవీ ఇదే అని డిసైడ్ అయ్యా. ఒక వ్యక్తి జీవితాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. ఇందులో ఎమోషన్ కు చాలా బాగా కనెక్ట్ అయ్యా. 

త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ చిత్రం కోసం షాహిద్ క్రికెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. తెలుగు వర్షన్ తెరక్కించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనే హిందీ వర్షన్ కూడా రూపొందుతోంది. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, అమన్ గిల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. 2020 సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.