ఇటీవల బాలీవుడ్ గాయని కనికా కపూర్ వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి తిరిగి వచ్చిన కనికా ప్రముఖులతో కలిసి పార్టీలలో పాల్గొనటం. ఆ పార్టీల్లో పలువురు జాతీయ నాయకులు పాల్గొనటం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో కనికా మీద కూడా కేసు నమోదు చేశారు. అయితే తాజాగా మరో కరోనా పాజిటివ్‌ వ్యవహారం బాలీవుడ్‌ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.

బాలీవుడ్‌ నిర్మాత కరిమ్‌ మోరానీకి కరోనా సోకినట్టుగా ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇటీవల కరిం కూతురు షాజా దుబాయ్‌ నుంచి తిరిగి రావటంతో ఆమెకు కరోనా సోకినట్టుగా తేలింది. ఈ విషయాన్ని కరిం స్వయంగా ప్రకటించారు. ఎలాంటి లక్షణాలు లేకుండానే షాజా కరోనా పాజిటివ్‌ గా తేలటంతో ఇండస్ట్రీ ప్రముఖులు షాక్‌ అయ్యారు.

అయితే షాజాకు పాజిటివ్‌ రావటంతో ఆమె కుటుంబ సభ్యులకు కూడా టెస్ట్ లు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె చెల్లెలు జోయా, తండ్రి కరిం లకు కూడా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఒక్కసారి ఇండస్ట్రీ వర్గాలు షాక్ కు గురయ్యారు. కరిం  ప్రముఖ నిర్మాత, పలు చిత్రాలకు ఫైనాన్సియర్‌ కూడా కావటంతో ఆయన చాలా మందిని కలిసి ఉంటాడని భావిస్తున్నారు. ఆయన భార్య, ఇంట్లో పనిచేసేవారికి కూడా టెస్ట్ లు నిర్వహించగా అందరికీ నెగెటివ్‌ రావటంతో కొంత వరకు ఊపిరి పీల్చుకున్నారు. బాలీవుడ్‌ బాద్‌ షా షారూఖ్‌ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన కరిం మొరానీ  రా వన్‌, చెన్నై ఎక్స్‌ ప్రెస్‌, హ్యాపీ న్యూ ఇయిర్‌, దిల్ వాలే లాంటి సినిమాలకు సహ నిర్మాత.