సెలబ్రిటీలతో పాటు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన విశేషాలు తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి కనబరుస్తుంటారు. ముఖ్యంగా స్టార్ వారసుల విషయంలో  ఈ క్యూరియాసిటీ మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. ఖాళీ సమయం దొరకటంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

బాలీవుడ్ బాద్‌ షా షారూఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌ కూడా ప్రస్తుతం ఇంటికే పరిమితమైంది. న్యూయార్క్‌లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటున్న ఆమె కరోనా అవుట్ బ్రేక్‌ కారణంగా ఇంటి వచ్చేసింది. అయితే ఈ సమయాన్ని వృథా చేయటం ఇష్టం లేక ఆన్‌లైన్‌లో బెల్లీ డాన్స్‌ క్లాసులు తీసుకుంటుంది. ఈ విషయాన్ని ప్రముఖ బెల్లీ డాన్సర్‌ సంజన ముత్రేజా సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

అంతేకాదు ఈ ఖాళీ సమయాల్లో మేకప్‌ ఆర్టిస్ట్ గా కూడా మారిపోయింది సుహానా. ఇటీవల సుహానా మేకప్‌ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆమె తల్లి గౌరీ ఖాన్‌. షారూఖ్‌ దంపతులు కరోనా వైరస్‌ బారిన పడిన వారిని ఆదుకోవటంలోనూ ముందే ఉన్నారు. నాలుగంతస్థుల తమ ఆఫీస్‌ బిల్డింగ్‌ను కరోనా అనుమానితుల క్వారెంటైన్‌ కోసం ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు అప్పగించారు.