తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన నటి కళ్యాణి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత హీరోయిన్ గా మారి సౌత్ లో అన్ని భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది.

తెలుగులో 'శేషు' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత 'ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు', 'కబడ్డీ కబడ్డీ' వంటి చిత్రాల్లో కనిపించింది. పెళ్లి తరువాత సినిమాలు చేయడం తగ్గించేసింది కళ్యాణి. చివరిగా ఆమె 'యాత్ర' సినిమాలో కనిపించింది. ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలు చేయడానికి సిద్ధమవుతోంది.

ఈ మధ్య కాలంలో చాలా మంది నటీమణులు సినీ నిర్మాణంపై ఆసక్తి చూపుతున్నారు. సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని మళ్లీ సినిమాలపైనే పెట్టుబడులుగా పెడుతున్నారు. ఇప్పుడు కళ్యాణి కూడా అదే చేస్తోంది.

ఆమె అసలు పేరు కావేరి, స్క్రీన్ పేరు కళ్యాణి కలిసి వచ్చేలా కే2కే ప్రొడక్షన్స్ బ్యానర్ పై వాస్తవ ఘటనల ఆధారంగా విలక్షణ ప్రేమకథతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాని నిర్మించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టనున్నారు.

తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతోంది. హోలీ సందర్భంగా ఈ సినిమా ప్రీలుక్, టీజర్ గ్లింప్స్‌ను టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ఈ సినిమాలో చేతన్ శీను, సిద్ధి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.