చాలా ఏళ్ల తర్వాత రాజశేఖర్ 'గరుడవేగ' చిత్రంతో హిట్ అందుకున్నారు. దీనితో ఈ యాంగ్రీ హీరోకి మళ్ళీ క్రేజ్ పెరిగింది. ఇటీవల వచ్చిన కల్కి చిత్రం కూడా పర్వాలేదనిపించింది. ప్రస్తుతం రాజశేఖర్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. 

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజశేఖర్, జీవిత దంపతులు వైసిపిలో చేరారు. ఆ పార్టీ తరుపున ప్రచారం కూడా చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లిష్ మీడియం రగడ నడుస్తోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల తెలుగు భాష, సంస్కృతి నాశనం అవుతుంది అంటూ విపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. దీనిపై రాజశేఖర్ తాజాగా స్పందించారు. తన సోషల్ మీడియా వేదికగా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయాలనే ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం సరైంది. 

ఈ పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. ఇంగ్లీష్ భాష రాక చాలా మంది ఉద్యోగావకాశాలు అందుకోలేకపోతున్నారు. దీనిని అధికమించాలంటే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం తప్పనిసరి అని రాజశేఖర్ అన్నారు. 

అదే సమయంలో తెలుగు భాషని తప్పనిసరి సబ్జెక్ట్ చేయాలి. విద్య అందరికి సమానంగా ఉండాలంటే ఇలాంటి నిర్ణయాలు తప్పవు అని రాజశేఖర్ ట్వీట్ చేశారు.