అలనాటి అందాల తార సీనియర్ నటి గీతాంజలి గురువారం నాడు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆమెను హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ఆసుపత్రిలోనే గురువారం నాడు కన్నుమూశారు.

గీతాంజలి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి. తెలుగుతో పాటు మళయాళం, హిందీ చిత్రాల్లో కూడ ఆమె నటించారు. 62 ఏళ్ల గీతాంజలి ఎన్టీఆర్ - ఏఎన్నార్ వంటి సీనియర్ యాక్టర్స్ తో నటించారు. 1961లో ఆమె మొదటిసారి తొలిసారిగా సీతారామ కళ్యాణం చిత్రం ద్వారా ఆమె సినిమా రంగంలోకి ప్రవేశించారు.

ఆ సినిమాలో సీతగా కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం సినీ కెరీర్ లో గీతాంజలి వెనక్కి తిరిగి చూసుకోలేదు. డాక్టర్ చక్రవర్తి, బొబ్బిలియుద్దం, దేవత, గూఢచారి 116 వంటి ఎన్నో డిఫరెంట్ సినిమాల్లో నటించారు.  పాత్ర ఏదైనా తన నటనతో సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేవారు, శ్రీశ్రీ మర్యాద రామన్న, కలవారి కోడలు, గుఢచారి 116, దేవత, నిండు హృదయాలువంటి సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు కూడా చాలా బాగా క్లిక్కయ్యాయి.  

ఇక 1972 తరువాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. 20 ఏళ్ల అనంతరం మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చి పెళ్ళైన కొత్తలో - మొగుడు - గ్రీకు వీరుడు వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. తెలుగులో 100కి పైగా సినిమాల్లో నటించిన గీతాంజలి హిందీ తమిళ్ మలయాళం సినిమాలతో కలిపి మొత్తంగా 400కి పైగా సినిమాల్లో ఆమె నటించారు.