తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన నటుడు గొల్లపూడి మారుతీరావు. నటుడిగా, రచయితగా, సంపాదకుడిగా ఆయన ఎంతో ఖ్యాతిని గడించారు. 1960లో గొల్లపూడి చిత్ర పరిశ్రమకు వచ్చారు. 

గొల్లపూడి మారుతీరావు అనారోగ్యం కారణంగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. వయసురీత్యా మారుతిరావు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. దీనితో కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. 

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రస్తుతం చెన్నై పర్యటనలోనే ఉన్నారు. మారుతీ రావు ఆరోగ్య పరిస్థితి గురించి తెలియడంతో ఆయన ఆసుపత్రికి వెళ్లారు. మారుతిరావుని పరామర్శించారు. కుటుంబ సభ్యులని ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. 

గొల్లపూడి త్వరగా కోలుకుని మునుపటిలా తిరగాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. ఎన్నో చిత్రాల్లో మారుతీ రావు అద్భుత నటన కనబరిచారు. తన దశాబ్దాల సినీ కెరీర్ లో మారుతీరావు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్య నటుడిగా, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో సైతం నటించారు. 

మారుతీరావు తరంగిణి చిత్రానికి ఉత్తమ హాస్య నటుడిగా, రామాయణంలో భాగవతం చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. ఓ సీత కథ, అన్నదమ్ముల అనుభందం, శుభలేఖ చిత్రాలకు రచయితగా పనిచేశారు. 1993లో వచ్చిన ప్రేమ పుస్తకం అనే చిత్రానికి దర్శకుడిగా కూడా మారుతీరావు వ్యవహరించారు.