ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పై కేసు నమోదైంది. కరోనాపై ఆయన పాడిన పద్యం చిక్కుల్లో పడేసింది. అంటరానితనాన్ని ప్రోత్సహించే విధంగా.. ఎస్సి, ఎస్టీలని కించపరిచే విధంగా జొన్న విత్తుల పద్యం ఉందంటూ తెలంగాణ మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ విమర్శించారు. 

ఈమేరకు ఆయన పోలీస్ స్టేషన్ లో జొన్నవిత్తులపై కేసు నమోదు చేశారు. కరోనాపై పలువురు రచయితలు ఇప్పటికే పాటల రూపంలో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. జొన్నవిత్తుల కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ పద్యం పాడారు. 

ఈ పద్యంలోభౌతిక దూరం పేరుతో అంటరానితనాన్ని ప్రోత్సహించేలా, తన జాతే గొప్పదని బ్రాహ్మణులని పొగుడ్తూ, దళితులని కించపరిచే విధంగా నిస్సుగ్గుగా జొన్నవిత్తుల వ్యాఖ్యలు చేశారని దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత  సంస్కృతి అంటే తన కులమే అని అర్థం వచ్చేలా జొన్నవిత్తుల పద్యం ఉందంటూ దళితులు మండిపడుతున్నారు. 

కానీ జొన్నవిత్తుల మాత్రం తన వ్యాఖ్యలని సమర్థించుకుంటున్నారు. కరోనా కారణంగా ప్రస్తుతం మానవజాతి మడికట్టుకుని ఉంది. మడి అంటే నువ్వు నన్ను తాకవద్దు, నేను నిన్ను తాకను అని అర్థం. శాస్త్రవేత్తలు చెబుతున్నది కూడా ఇదే అని జొన్నవిత్తుల అంటున్నారు. ఎవరినో కించపరచాలని తాను ఈ పద్యం పాడలేదని జొన్నవిత్తుల అన్నారు.