శరణ్య శశి మృతిపై కేరళ సీఎం పినరయి విజయన్, మలయాళీ నటుల సంఘం, ఇతర భాషల సినీ సంఘాలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళి అర్పించారు.
ప్రముఖ మలయాళ నటి శరణ్య శశి (35) మృతి చెందారు. గత కొంతకాలంగా ఆమె కేరళ త్రివేండ్రంలోని ఓ ప్రైవేటు ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం(ఆగస్టు9)న తుదిశ్వాస విడిచారు. చిన్న వయసులోనే మలయాళ సినీ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న శరణ్యకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు పదేళ్ల కిందటే నిర్థారణ అయింది. అయితే నిరాశపడకుండా కాన్సర్ పై ఆమె తన పోరాటాన్ని కొనసాగించింది. గడిచిన పదేళ్లలో శరణ్యకు 11 పెద్ద శస్త్రచికిత్సలు జరిగాయి. ఆ సమయంలోనే తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న శరణ్యకు పరిశ్రమలోని పలువురి నటులు సహాయం అందించారు.
అయితే కొన్ని వారాల క్రితం ఆమెకు కరోనా సోకడంతో మరోసారి ఆమె తీవ్ర అనారోగ్యం బారిన పడింది. న్యుమోనియాతో పాటు రక్తంలో స్టోడియం స్థాయిలు పడిపోవడంతో కొన్ని రోజుల పాటు కేరళలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శరణ్య చికిత్స పొందింది. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడటంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి సోమవారం కన్నుమూసింది.
మలయాళంలో మంత్రకోడి, సీత అండ్ హరిచందనం లాంటి సినిమాలతోపాటు పలు మలయాళ టీవీ సిరియల్స్‌తోనూ చేసారు శరణ్య శశి. ఆమె నటనతో ఇట్టే అకట్టుకునేవారు. ఆమె చేసిన సీరియల్స్ ,సినిమాలతో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత కాలంలో అనేక సినిమాల్లో సహాయక పాత్రలను కూడా పోషించింది. శరణ్య శశి మృతిపై కేరళ సీఎం పినరయి విజయన్, మలయాళీ నటుల సంఘం, ఇతర భాషల సినీ సంఘాలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళి అర్పించారు.
