కరోనా వైరస్‌ కారణంగా అన్ని రంగాలు కుదేళవుతున్నాయి. ముఖ్యంగా సినీ రంగం మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సడన్‌ గా లాక్ డౌన్‌ ప్రకటించటంతో అప్పటి వరకు సెట్స్ మీద ఉన్న సినిమాల పనులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  సినిమా మీద కోట్లు వెచ్చించిన దర్శక నిర్మాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌ ఇండస్ట్రీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

బాలీవుడ్‌లో చాలా భారీ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్‌ లీలా భన్సాలీ ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. భన్సాలీ చిత్రాలంటే విజువల్ గ్రాండియర్‌గా తెరకెక్కుతున్నాయి. గతంలో ఆయన దర్శకత్వంలో రామ్ లీలా, బాజీరావ్‌ మస్తానీ, పద్మావత్‌ లాంటి భారీ చిత్రాలు రూపొందాయి. ఇప్పుడు అదే తరహాలో గంగూబాయ్‌ కతియావాడీ అనే బయోపిక్‌ను రూపొందిచేందుకు రెడీ అవుతున్నాడు సంజయ్‌. ఈ సినిమాలో అలియా భట్‌ కీలక పాత్రలో నటిస్తోంది.

ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో భారీ సెట్‌ను రూపొందించారు. అయితే ఆ సెట్‌ను ఇప్పుడు కూల్చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృభిస్తున్న నేపథ్యంలో పరిస్థితులు ఇప్పట్లో చక్క బడే అవకాశం కనిపించటం లేదు. దీంతో షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావటానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో అప్పటి వరకు సెట్ ను వేసి ఉంచితే స్టూడియో రెంట్లు తడిసి మోపెడు అవుతాయని భావిస్తున్నారు. అందుకే సెట్‌ను కూల్చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమా విషయంలోనే కాదు మరిన్ని సినిమాల విషయంలో దర్శక నిర్మాతలు ఇదే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.