‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగులోనూ, కబీర్ సింగ్ సినిమాతోనూ బాలీవుడ్‌లో ప్రభంజనం సృష్టించిన దర్శకుడు సందీప్ వంగా. తెలుగులోనూ, హిందీలోనూ ఈ రెండు చోట్లా కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలిచిన ఈ సినిమాలు. రెండు చోట్లా కలెక్షన్స్ వర్షం కురిపించాడు. అంతేకాదు అప్పటివరకు సాధారణ హీరోగా ఉన్న విజయ్ దేవరకొండ.. ఒక్కసారిగా యూత్ సెన్సేషన్‌గా మారేలా చేసాడు. అదే పరిస్దితి హిందీలో షాహిద్ కపూర్ కు కబీర్ సింగ్ తో వచ్చింది. దాంతో సందీప్ వంగా తో సినిమా చేయటానికి నిర్మాతలు, హీరోలు ఉవ్విళ్లూరుతున్నారు.  

ఈ నేపధ్యంలో  సందీప్ వంగా తదుపరి ప్రాజెక్ట్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ‘కబీర్ సింగ్’ తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ వట్టి రూమర్స్ అని  తాజాగా వచ్చిన ఎనౌన్సమెంట్ తేల్చేసింది.  సందీప్ వంగా మళ్ళీ బాలీవుడ్ హీరోతోనే సినిమా చేస్తున్నారు. కబీర్ సింగ్ నిర్మాతలు అయిన టీ సీరిస్ వారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రకటన చేసారు. అయితే ఈ సినిమాలో నటించేది ఎవరనేది మాత్రం చెప్పలేదు.

అయితే బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. బీ-టౌన్ యంగ్ హీరోల్లో ఒకరైన రణబీర్ కపూర్‌ తో ఈ ప్రాజెక్టు ఉండబోతోందట. రణబీర్ కు ఇటీవల ఓ స్టోరీ లైన్ చెప్పడం.. దానికి రణబీర్ కూడా ఓకే చెప్పడం జరిగిందని అక్కడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఒక ఇంటెన్స్ క్రైమ్ డ్రామా అని.. ఈ సినిమాలో రణబీర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించనున్నాడని వినికిడి. అంతేకాకుండా ఈ సినిమాకు సందీప్ వంగా ‘డెవిల్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నాడని సమాచారం.