సినీ రంగం కొంత మందికి ఏ స్థాయిలో కలిసి వస్తుందో.. మరికొంత మందికి అదే స్థాయిలో నష్టం కూడా చేస్తుంది. ఇక్కడ శిఖరాగ్రాలను తాకిన వారు ఎంతమంది ఉన్నారో..? అసలు అడ్రస్ లేకుండా పోయినా వారు అంత వందల రెట్లు ఎక్కువ మందే ఉన్నారు. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సర్వం కోల్పోయి చివరకు ప్రాణాలు విడిచిన వారూ ఉన్నారు. తాజాగా అలాంటి సంఘటనే కన్నడ సినీ పరిశ్రమలో జరిగింది.

సాండల్ వుడ్‌కు చెందిన బిజినెస్‌మేన్‌, ప్రొడ్యూసర్‌ మోహన్‌ అలియాస్‌ కపాలి మోహన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. యశ్వంతపుర గంగమ్మగుడి పోలీసుస్టేషన్‌ పరిధిలోని బసవేశ్వర కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్‌కు దగ్గర మోహన్‌ సుప్రీం అనే హోటల్‌ ఆయనకు ఉంది. ఆదివారం రాత్రి మోహన్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవటం అందరినీ షాక్‌కు గురిచేసింది. స్నేహితుడు మంజునాథ్‌ తో కలిసి భోజనం చేసిన కొద్ది సేపటికే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఆదివారం రాత్రి కొడుకుతో మాట్లాడిన తరువాత ఫ్రెండ్‌తో కలిసి హోటల్‌ కు వెళ్లిన మోహన్‌, ఫ్రెండ్‌ నిద్రలో ఉండగానే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు ఆయన ఓ వీడియో సందేశాన్ని రికార్డ్ చేశాడు. తనకు హోటల్‌ బిజినెస్‌లో నష్టాలు వచ్చాయి ఆయన ఆ వీడియోలో తెలిపాడు. తన మరణం తరువాత కుటుంబం ఇబ్బందులు పాలు కాకుండా ఆదుకోవాలని ఆయన వేడుకున్నాడు.