సమంత, శర్వానంద్ తాజాగా నటించిన చిత్రం జాను. తమిళంలో ఘనవిజయం సాధించిన 96 చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. తమిళ వర్షన్ లో త్రిష, విజయ్ సేతుపతి నటించారు. తెలుగులో శర్వానంద్, సమంత కలసి నటిస్తుండడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. 

తమిళ వర్షన్ తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ దర్శత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. తాజాగా చిత్ర యూనిట్ జాను టీజర్ రిలీజ్ చేసింది. ఎమోషనల్ ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సమంత, శర్వానంద్ తమ పాత్రల్లో ఒదిగిపోయి కనిపిస్తున్నారు. 

బాల్యంలో మొదలైన ప్రేమ చివరకు ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఈ చిత్ర కథ. టీజర్ లో సమంత, శర్వానంద్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఎమోటినల్ సన్నివేశాలు చాలా బలంగా ఉండబోతున్నాయి. 'చాలా దూరం వెళ్లిపోయావా రామ్.. నిన్నెక్కడ వదిలేశానో అక్కడే ఉన్నాను' అంటూ సమంత, శర్వా మధ్య జరిగే సంభాషణ ఆకట్టుకుంటోంది. 

తన ప్రియురాలి కోసం వెతుకుతూ ప్రేమ కోసం పరితపించే యువకుడి పాత్రలో శర్వానంద్ నటిస్తున్నాడు. గోవింద్ వసంత ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. తమిళంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ఘనవిజయాన్ని అందుకుంది. తెలుగులో కూడా అలంటి మ్యాజిక్ రిపీట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.