తెలుగులో అనేక చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించిన బాలీవుడ్ దర్శకరచయిత, నటుడు మహేశ్ మంజ్రేకర్ గుర్తుండే ఉండి ఉంటారు. మహేశ్ మంజ్రేకర్ తెలుగు ప్రేక్షకులకు  బాగా పరిచయం. ఒక్కడున్నాడు, హోమం, అదుర్స్, డాన్ శీను, అఖిల్, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించారు. ఆయన ఇప్పుడు తన కుమార్తెను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. అది కూడా సాదా సీదా సినిమాతో కాదు..సల్మాన్ ఖాన్ సరసన కావటం విశేషం.  మహేశ్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ వెండితెరకు పరిచయం అవుతోంది. సల్మాన్ ప్రస్తుతం దబాంగ్-3 చేస్తున్నారు. ఇందులో సాయి మంజ్రేకర్...సినిమాలో కీలకమైన  ఖుషీ అనే పాత్ర పోషిస్తోంది.

సల్మాన్ సినిమాలో ఆమె చేస్తూండటంతో  ఖచ్చితంగా బాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తాయనటంలో సందేహం లేదు. మరో ప్రక్క ఆమె తండ్రి తెగ మురిసిపోతున్నారు. తన కూతురుతో తెరపై కనిపించటం చాలా భావోద్వేగం కలిగిస్తుందని చెప్తున్నారు.  అలాగే చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే.. ఈ చిత్రంలో తన తండ్రి మహేశ్ మంజ్రేకర్ తో నటించిన ఓ సీన్ కూడా ఉంటుందట! తాజాగా, చిత్రం టీమ్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది.

'ఎటువంటి మాలిన్యం లేని స్వచ్ఛమైన మా అమాయకపు చిన్నారి ఖుషీ' అనే కామెంట్ ని ఈ పోస్టర్ తో పాటు జోడించారు. బాలీవుడ్ లో దబాంగ్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడీ చిత్రం ఆ సినిమాకు మూడో సీక్వెల్ . సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తున్న ఈ దబాంగ్-3 చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు.  ఇప్పటికే సోనాక్షీ సిన్హాతో పాటు కన్నడ స్టార్‌ హీరో సుదీప్‌ పోస్టర్‌లను ఇప్పటికే రిలీజ్‌ చేశారు. సల్మాన్‌ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న దబాంగ్‌-3 ట్రైలర్‌ అక్టోబరు 23న బయటకు రానుంది. కాగా ఈ చిత్రం డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.