మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, డైరెక్టర్ మారుతి తొలి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ప్రతిరోజూ పండగే. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి బజ్ నెలకొని ఉంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ ప్రతిరోజూ పండగే మూవీ ట్రైలర్ విడుదల చేసింది. 

ఊహించినట్లుగానే దర్శకుడు మారుతి ఈ చిత్రంతో ఫ్యామిలీ ఎమోషన్స్ ద్వారా మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రైలర్ మొత్తం కుటుంబ సరదాలు, ఎమోషన్స్ ని హైలైట్ చేశారు. లంగ్ క్యాన్సర్ తో బాధపడుతున్న తన తాతకు చివరి రోజుల్లో మనవడు ఎలాంటి సంతోషాన్ని అందించాడనేదే ఈ చిత్ర కథ. 

తాత పాత్రలో సత్యరాజ్ నటించారు. తండ్రికి చివరి రోజులు అని తెలిసినా విదేశాల్లో ఉన్న కొడుకులు వచ్చేందుకు ఆలోచిస్తుంటారు. తేజు వారిని ఎలా ఇండియాకు రప్పించాడు.. తాతకు ఎలాంటి సంతోషాన్ని అందించారు అనే అంశాన్ని మారుతి అందంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 

ఇక ట్రైలర్ లో హీరోయిన్ రాశి ఖన్నా పాత్ర కూడా ఆకర్షిస్తోంది. రాశి ఖన్నా ఈ చిత్రంలో ఏంజెల్ ఆర్నాగా గోదావరి యాసలో డైలాగులు చెబుతోంది. 'ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకున్నావ్ రా బై' అంటూ రాశి ఖన్నా చెప్పే డైలాగ్ బావుంది. 

ఇతర పాత్రల్లో రావు రమేష్, నరేష్ తదితరులు నటిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న ప్రతిరోజూ పండగే చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది.