మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తనకంటూ టాలీవుడ్ ప్రత్యేకమైన గుర్తింపు, మార్కెట్ సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది తేజు నటించిన చిత్రలహరి చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం 'ప్రతిరోజూ పండగే'. 

మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్ 20న క్రిస్టమస్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తూనే.. ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ , పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఇక త్వరలో థియేట్రికల్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. ప్రతిరోజూ పండగే చిత్ర ట్రైలర్ ని డిసెంబర్ 4న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. 

ఈ చిత్రంలో డైరెక్టర్ మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉంటూనే.. మనిషి పుట్టినప్పుడు ఎలా సెలెబ్రేట్ చేసుకుంటామో మరణాన్ని కూడా అలాగే సెలెబ్రేట్ చేసుకోవాలనే సరికొత్త మెసేజ్ ని ఈ చిత్రం ద్వారా అందించబోతున్నారు. సాయిధరమ్ తేజ్ కు జోడిగా రాశి ఖన్నా నటిస్తోంది. ఈ చిత్రంలో రాశి, తేజు మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణ కాబోతోంది. 

ప్రముఖ నటుడు సత్యరాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు.