సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నుంచి రాబోతున్న లేటెస్ట్ మూవీ 'ప్రతిరోజూ పండగే'. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. చిత్రలహరి లాంటి హిట్ తర్వాత తేజు నుంచి వస్తున్న మూవీ కావడంతో ప్రతిరోజూ పండగేపై మంచి అంచనాలు నెలకొన్నాయి. సాయిధరమ్ తేజ్ సరసన ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. 

డిసెంబర్ 20న శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో సాయిధరమ్ తేజ్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నాడు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేజు ప్రతిరోజూ పండగే చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 

చాలా మంది ప్రతిరోజూ పండగే చిత్రాన్ని, శతమానం భవతి చిత్రంతో పోల్చుతున్నారు. అది సరికాదు. ఈ రెండు చిత్రాలకు పోలిక లేదు అని తేజు తెలిపాడు. ఇది ఓ తాత మనవడి కథ. చాలా మంది ఉద్యోగాల పేరుతో తల్లిదండ్రులని విడచి విదేశాలకు వెళ్లిపోతుంటారు. అలాంటి వారందరి హృదయాల్ని ఈ చిత్రం తాకుతుంది. 

ప్రతిరోజూ పండగే చిత్ర కథని చిరంజీవి విన్నారు. నాకు చెప్పినట్లుగానే సినిమా తీస్తారా లేదా అది కూడా చూస్తా అంటూ చిరంజీవి అన్నట్లు తేజు తెలిపారు. మల్టీస్టారర్ చిత్రాలపై తేజు స్పందిస్తూ.. తనకు రవితేజతో కలసి నటించాలని ఉన్నట్లు తెలిపాడు. మేమిద్దరం కలసినప్పుడలా చాలా సరదాగా మాట్లాడుకుంటాం. 

ఇక పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండడంపై తేజు స్పందించాడు. పింక్ రీమేక్ లో పవన్ నటించనున్న సంగతి తెలిసిందే. సినిమా ఒకే అయినట్లు ఉంది. ఆ ప్రాజెక్ట్ గురించి మీకు తెలిసిన సంగతులే నాకు కూడా తెలుసు. ఆయన మళ్ళీ తెరపై కనిపిస్తే చూడాలని కోరుకునే వారిలో నేను కూడా ఒకడిని. టైమ్ బాంబు ఇప్పుడే ఆన్ అయింది. త్వరలో పేలనుంది అంటూ పవన్ రీఎంట్రీ ఉద్దేశించి తేజు కామెంట్ చేశాడు.