వరుస ఫ్లాప్ లతో డీలా పడ్డ మెగాహీరో సాయి తేజ్ 'చిత్రలహరి' సినిమాతో ఫ్లాప్ ల నుండి బయట పడ్డాడు. ఇప్పుడు అతడి నుండి వచ్చిన 'ప్రతిరోజు పండగే' చిత్రం హిట్ దిశగా దూసుకుపోతుంది. మొదట ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా సినిమా దూసుకుపోతుంది.

ఈ సినిమా తరువాత తేజు 'సోలో బతుకే సో బెటర్' అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ని లైన్ లో పెట్టాడు. దాని తరువాత తేజు పెద్ద రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. 'వెన్నెల', 'ప్రస్థానం' లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకొని ఆ తరువాత వరుస డిజాస్టర్ లు తీసిన దర్శకుడు దేవకట్టాతో తేజు సినిమా తీయడానికి సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది.

సంపాదించడం మాకూ తెలుసు.. స్టార్ హీరోలకు ధీటుగా వారి భార్యలు!

త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ రాబోతున్నట్లు సమాచారం. 'ఆటోనగర్ సూర్య', 'డైనమైట్' వంటి సినిమాల తరువాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న దేవకట్ట 'ప్రస్థానం' సినిమాని హిందీలో రీమేక్ చేశారు. కానీ ఆ సినిమా బాలీవుడ్ లో వర్కవుట్ కాలేదు.

దీంతో అతడితో సినిమా చేయడానికి సిద్ధమైన తేజుకి అతడి స్నేహితులు, సన్నిహితులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సలహాలు ఇస్తున్నారట. కానీ తేజు వాటిని పట్టించుకోవడం లేదట.

దేవకట్టాకి మాటిచ్చానని.. అతడు చెప్పిన సబ్జెక్ట్ కూడా బాగా నచ్చిందని.. అది తనకు మంచి సినిమా అవుతుందని తేజు ధీమాగా చెబుతున్నాడట. అయితే అతడి సన్నిహితులు మాత్రం తేజు రిస్క్ తీసుకుంటున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.