ప్రతి ఒక్కరి జీవితంలో లవ్‌ స్టోరీ ఉంటుంది. ఏదో ఒక ఏజ్‌లో ప్రేమలో పడటం సహజమే. అందుకు సినీ హీరోలు ఏమాత్రం అతీతులు కారు. నిజం చెప్పాలంటే వారి జీవితంలోనే ఎక్కువగా ప్రేమ కథలుంటాయి. బయటకు చెప్పేవి కొన్ని లవ్‌ స్టోరీలుంటే, చెప్పలేనివి, చెప్పకూడనివి చాలానే ఉంటాయి. మెగా హీరో సాయితేజ్‌ జీవితంలోనూ అదిరిపోయే లవ్‌ స్టోరీ ఉందట. అది మామూలు ప్రేమ కథ కాదు. లవ్‌ స్టోరీ చిత్రాలకు ఓ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే `ప్రేమ దేశం` తరహా లవ్‌ స్టోరీ తన జీవితంలో ఉందని చెబుతున్నారు. తాజాగా ఆయన ఓ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రేమ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

 కాలేజ్‌ రోజుల్లో `ప్రేమ దేశం` లాంటి ప్రేమ కథ తన జీవితంలో జరిగిందని, తను, తన స్నేహితుడు తెలియకుండా ఒకే అమ్మాయిని ప్రేమించారట. ఆ అమ్మాయి కాలేజ్‌ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ విషయం తెలిసి ఇద్దరూ గొడవపడ్డారని, ఆ తర్వాత వారిద్దరి మధ్య స్నేహం మరింత బలపడిందని తెలిపారు. అయితే ఆ అమ్మాయి కాలేజ్‌ వదిలేసి వెళ్ళిపోవడంతో ఇద్దరూ తెగ బాధపడ్డారట. ఆ లవ్‌ స్టోరీ తలచుకుంటే నవ్వొస్తుందని, అదే సమయంలో అదొక మంచి అనుభూతినిచ్చిందని తెలిపారు సాయితేజ్‌.  అంతేకాదు అలాంటి కథతో, `ప్రేమ దేశం` తరహాలో ఓ సినిమా చేయాలనుకుంటున్నారట. కాలేజ్‌ రోజుల్లో `ప్రేమ దేశం` సినిమా తనని బాగా ప్రభావితం చేసిందని, ముఖ్యంగా `ముస్తఫా ముస్తఫా..` పాటని పాడుకునేవాళ్లమన్నారు. 

పెళ్ళి గురించి చెబుతూ, దానికి ఇంకా టైముందని, ప్రస్తుతం తనపై పలు బాధ్యతలున్నాయని, కెరీర్‌ పరంగా బాగా కష్టపడుతున్నానని, అన్నీ సెట్‌ అయ్యాక పెళ్ళి చేసుకుంటానని తెలిపారు. మ్యారేజ్‌ గురించి మొన్నటి వరకు ఇంట్లో కూడా ఫోర్స్ చేశారని, ఇప్పుడు తన పరిస్థితిని అర్థం చేసుకున్నారన్నారు. మొత్తంగా ఇప్పట్లో తన పెళ్ళి కబురు చెప్పే అవకాశం లేదని చెప్పకనే చెప్పాడు. 

ప్రస్తుతం సాయితేజ్‌ `సోలో బ్రతుకే సో బెటర్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది చిత్రీకరణ చివరి దశలో ఉంది. సుబ్బు దర్శకత్వంలో రొమాంటిక్‌ సెటైరికల్‌ కామెడీగా ఇది రూపొందుతుంది. పెళ్లి వద్దు సోలే బ్రతుకే బెటర్‌ అని చెప్పడం ఈ సినిమా ఉద్దేశం. ఇటీవల విడుదలైన టైటిల్‌ సాంగ్‌ విశేష ఆదరణ పొందింది.