మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'ప్రతిరోజూ పండగే'. గీతా ఆర్ట్స్ 2 సంస్థ బ్యానర్ లో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రతిరోజూ పండగే చిత్రంపై మంచి బజ్ నెలకొని ఉంది. 

ఇటీవల విడుదలైన ట్రైలర్. తమన్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. చివరి రోజుల్లో చావుకు దగ్గరవుతున్న తన తాత కోసం ఓ మనవడిగా సాయిధరమ్ తేజ్ ఏం చేశాడనేదే ఈ చిత్ర కథ. రాశి ఖన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. రావు రమేష్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, ట్రైలర్స్ లో సాయిధరమ్ తేజ్ నార్మల్ లుక్ లోనే కనిపించాడు. తాజాగా చిత్ర యూనిట్ ప్రతిరోజూ పండగే చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్ ని రిలీజ్ చేసింది. ఇందులో సాయిధరమ్ తేజ్ సిక్స్ ప్యాక్ లుక్ లో అదరగొడుతున్నాడు. కండలు తిరిగిన శరీరంతో శత్రువులతో పోరాడుతున్నాడు. 

ప్రతిరోజూ పండగే చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. అయినప్పటికీ ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం తేజు కండలు ప్రదర్శిస్తున్నాడు. పంచె కట్టి షర్ట్ లేకుండా ఉన్న తేజు లుక్ కేకపెట్టించేలా ఉంది. ప్రస్తుతం ఈ పిక్ సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

తన తొలి చిత్రం 'రేయ్' లో తేజు సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించాడు. ఇన్నేళ్లకు మరోసారి తేజు కండల శరీరంతో కనిపిస్తుండడం ఆసక్తిగా మారింది. ప్రతిరోజూ పండగే చిత్రం డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.