సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న ప్రతిరోజూ పండగే చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరందుకుంటున్నాయి. ఈ చిత్ర ఫస్ట్ లుక్, ఇటీవల విడుదల చేసిన గ్లిమ్ప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో మారుతి ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్నారు. 

తాజాగా ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న సంగీత దర్శకుడు తమన్.. ప్రతిరోజూ పండగే చిత్ర టైటిల్ సాంగ్ కు చక్కటి మ్యూజిక్ అందించాడు. ఆహ్లాదభరితమైన సంగీతం, అర్థవంతమైన సాహిత్యం ఆకట్టుకుంటోంది. 

ఈ పాటకు ప్రముఖ లిరిసిస్ట్ కెకె సాహిత్యం అందించారు. శ్రీకృష్ణ గాత్రం ఈ పాట స్థాయిని పెంచే విధంగా ఉంది. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ, సత్యరాజ్ పాత్రని తెలియజేసేలా టైటిల్ సాంగ్ ఉంది. సత్యరాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. 

గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 20న ప్రతిరోజూ పండగే చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. 

అప్పటి వరకు వరుస పరాజయాలు ఎదుర్కొన్న సాయిధరమ్ తేజ్.. ఈ ఏడాది విడుదలైన చిత్రలహరి చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. చిత్రలహరి విజయం తర్వాత తేజు ఆచితూచి కథలు ఎంచుకుంటున్నాడు. సుప్రీం తర్వాత తేజు, రాశి ఖన్నా మరోసారి రొమాన్స్ చేస్తున్న ప్రతిరోజూ పండగే చిత్రంపై మంచి బజ్ నెలకొని ఉంది.